భారత్‌ వ్యాక్సిన్‌కు వందకు పైగా దేశాల్లో గుర్తింపు

 

ప్రయాణాల్లో ఆంగీకరిస్తున్నట్లు లోక్‌సభలో మంత్రి ప్రకటన

న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి):  భారత దేశం జారీ చేసే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌కు 100కుపైగా దేశాల గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ లోక్‌సభకు చెప్పారు. డిసెంబరు 6 వరకు అందిన సమాచారం ప్రకారం 108 దేశాలు ప్రయాణాల కోసం ఈ ధ్రువపత్రాన్ని గుర్తిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. వ్యాక్సిన్ల వినియోగానికి ఆమోదం తెలిపే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ సహాయ పడుతుందన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీలు, సభ్య దేశాలకు ఈ సహకారం లభిస్తుందని తెలిపారు. టీకాల నాణ్యత, భద్రత, సమర్థత, పనితీరుపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సహాయం చేస్తుందన్నారు. అత్యవసర ప్రజారోగ్య సేవలు అవసరమైనవారికి ఈ ప్రొడక్ట్స్‌ అందుబాటును వేగవంతం చేయడమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశాలు కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ దిగుమతి చేసుకోవడానికి, ప్రజలకు ఇవ్వడానికి సంబంధించిన అనుమతుల మంజూరును వేగవంతం చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇటువంటి టీకాలు తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు వివిధ దేశాలు పరిగణిస్తున్నట్లు తెలిపారు. వీరిని అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణాల కోసం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలనే నిబంధన ప్రస్తుతం మన దేశంతోపాటు చాలా దేశాల్లో లేదన్నారు.