భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు వేసిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు
జనం సాక్షి, చెన్నారావుపేట
మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన భారతదేశ బడుగు, బలహీన వర్గాల నాయకుడు విద్యార్థి దశలో కేవలం 32 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ రాసిన ఒక పుస్తకం భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచిందని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ డిగ్రీ కోసం ఆయన చేసిన పరిశోధన ఈ పుస్తక రూపంలో ఆవిష్కృతమైందని ఆ పరిశోధన సారాంశం ఆధారంగా రాసి 1923లో లండన్ లో వెలువరించిన ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ పుస్తకం భారత, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలు బలపడడానికి సహకరించిందని దీనిపై జరిగిన చర్చల అనంతర కాలంలో రిజర్వ్* బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు పరిచాయని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరికీ తెలుసని,భారత సమాజంలోని కుల వ్యవస్థ కారణంగా దశాబ్దాల పాటు అనగారిన దళిత వర్గాల్లో చైతన్యం నింపిన నాయకుడిగా ఆయన పరిచయం ఇంతటి విప్లవాన్ని ఒంటి చేత్తో నడిపించినందుకు ఆయనను మహామానవ్ అని భారత ప్రజానికం ఆప్యాయంగా పిలుచుకుంటుందని అన్నారు.అంబేద్కర్ వ్యక్తిత్వం, విశ్వవాపితం, మతం, మానవ వికాసం, సామాజిక శాస్త్రాలు, రాజనీతి శాస్త్రం ఇలా అన్నింటిలోనూ ఆయన మేధాశక్తి అపారమైనదని అన్నారు. ఆయన రచనలు, ప్రసంగాలను పరిశీలిస్తే ఆయన హృదయానికి, ఆలోచనలకు దగ్గరగా ఉన్నది మాత్రం ఆర్థిక శాస్త్రం మాత్రమేనని అర్థమవుతుందని అన్నారు. ఇంతటి మేధాశక్తి గల వ్యక్తిని భారత దేశ దశ, దిశను మార్చిన మహా నాయకుడిని మరవటం ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం యావత్ భారతదేశానికే సిగ్గుచేటని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు బాటలు వేసిన అంబేద్కర్ ముఖచిత్రం కరెన్సీ పై లేకపోవడం చాలా బాధాకరమని, ప్రభుత్వాలు వెంటనే భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించి ఆయనకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.