భారత జట్టుతో నడిచిన మిస్టరీ ఉమెన్ తెలిసింది..!
న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) కట్టుదిట్టమైన భద్రత, పూర్తి సమాచారం మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమనీలో భారత బృందంతోపాటు ఒక గుర్తు తెలియని మహిళ కనిపించింది. భారత బృందానికి కేటాయించిన పసుపు తెలుపు రంగు డ్రెస్ కోడ్‌కు విరుద్ధంగా ఆమె ఎరుపు రంగు టీ-షర్టు, బ్లూ రంగు జీన్స్ ప్యాంటు దరించింది. భారత బృందంతోపాటు ఈ పరేడ్‌లో జాతీయ పతాకధారి సుశీల్‌కుమార్ పక్కన నడుస్తూ కనిపించిన మిస్టరీ ఉమెన్ ఎవరనేది తెలిసింది. బెంగళూరుకు చెందిన మెడికల్ పీజీ విద్యార్థి మధుర హనీగా గుర్తించారు. ఒలింపిక్స్ స్టేడియంలో ప్రారంభోత్సవాన్ని తిలకిస్తున్న హనీ… ఇండియన్ టీము రాగానే వెంటనే లేచి స్టేడియంలోకి వెళ్లింది. ముందుండి టీముతో పాటు నడిచింది. ఒలింపిక్స్ మార్చ్ఫాస్ట్లో ఎవరెవరు పాల్గొనాలనే విషయాన్ని చాలా ముందుగానే నిర్ణయిస్తారు. వీరు తప్ప మరెవరూ ఇందులో పాల్గొనడానికి వీల్లేదు. అందుకే గుర్తు తెలియని మహిళ ఒకరు ఇండియన్ టీముతో పాటు నడవడం సంచలనం సృష్టించింది. టీవీల్లో ప్రముఖంగా ఈ దృశ్యాలు రావడంతో ఆమె ఎవరో గుర్తించడానికి వీలైంది. మధుర హనీ తన ఫేస్బుక్ అకౌండ్ డీయాక్టివేట్ చేసింది.భారత బృందంతోపాటు ఈ పరేడ్‌లో జాతీయ పతాకధారి సుశీల్ కుమార్ పక్కన నడుస్తూ కనిపించిన సదరు మహిళ భారత బృందంలో సభ్యురాలు కాదని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చెప్పింది. భారత్‌కు తాత్కాలిక చీఫ్ డి మిషన్‌గా వ్యవహరిస్తున్న బ్రిగేడియర్ పికె మురళీధరన్ ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.