భారీగా పెరిగిన అంగన్‌వాడీల జీతాలు
సిఎం చంద్రబాబు ప్రకటనతో హర్షం
అమరావతి,జూన్20(జనం సాక్షి ): రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్ వాడీలపై వరాల జల్లు కురిపించారు. 7500గా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్ల పైచీలుకు భారం పడుతుందని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అంగన్‌వాడీల వేతనాలను పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంతకాలంగా వారు చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సిఎం నిర్ణయంపై అంగన్‌వాడీలు హర్షం వ్యక్తం చేశారు.