భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి
అడ్వకేట్ జేఏసీ అశ్రునివాళి
హైదరాబాద్, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న అమరుడు యాదిరెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయక న్యాయవాదులు గన్‌పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదిరెడ్డి త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులుమాట్లాడుతూ ఇప్పటి వరకు 800 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, అయినా పాలకులు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష యావత్ దేశానికి యాదిరెడ్డి తన అమరత్వంతో చాటి చెప్పాడన్నారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌లోకి నాడు అనుమతించ లేదంటే, యాదిరెడ్డి ఆత్మార్పణను మామూలు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారంటేనే తెలంగాణపై ఎంత వివక్ష చూపుతున్నారో అర్థమవుతున్నదని మండిపడ్డారు. యాదిరెడ్డి త్యాగాన్ని వృథా కానివ్వమని, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా రాజీ లేని పోరాటాని సాగిస్తామని స్పష్టం చేశారు.