భారీ వర్షంలో రాజీవ్‌ రహదారి దిగ్భంధనం

5

– తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు పెల్లుబీకిన నిరసన

– ట్రాఫిక్‌ మళ్లింపు

– కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

– బీడు భూములకు నీళ్లు మళ్లే వరకు పోరు ఆగదు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌

కరీంనగర్‌, ఆగస్టు12(జనంసాక్షి):

తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది ప్రజలకు మేలు జరిగేలా కార్యక్రమాలు చేయడానికా… కాంగ్రెస్‌, టీడీపి నేత చంద్రబాబులను అనునిత్యం తిట్టడానికేనా అని సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర కాంగ్రెస్‌ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌ వద్ద తోటపల్లి రిజర్వాయర్‌ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాజీవ్‌ రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాకార్యకర్తలు, నాయకులతో కలిసి రోడ్డుపైనే భైఠాయించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ నిరసనను తెలిపారు ఈసందర్బంగా ధర్నానుద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ విధానాలను ఎండగట్టారు. బంగారు తెలంగాణా నిర్మిస్తామంటూనే కొద్ది పాటి నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను రద్దు చేస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడని, పూర్తిగా పాలనను మరిచిపోయి కాంగ్రెస్‌ను ఓవైపు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంకోవైపు తిట్టడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆయన పాలనా విధానలను నచ్చకనే  నేడు రాష్ట్రంలోని అనేక వర్గాలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నాయన్నారు. ప్రధానంగా ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కడ కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందోననే భయం కేసీఆర్‌కు పట్టుకుందని, అందుకే పాతవాటిని రద్దు చేసి రీడిజైనింగ్‌ అంటున్నాడని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టును కూడా వివాదాస్పదంగా మారుస్తున్నాడని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.2007లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ఆర్‌ మిడ్‌మానేర్‌కు అనుసందానంగా తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను నిర్మించాలని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌పై ఇప్పటికే 500 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. ఇంకొన్ని భూములను సేకరిస్తే రిజర్వాయర్‌ పనులు కూడా చేపట్టే అవకాశం ఉన్నా కూడా ఏకంగా రద్దు చేస్తామనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేసి పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వేలకోట్లను వెచ్చించిన ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును కూడా రద్దు చేసి కాళేశ్వరం వద్ద నిర్మిస్తామని చెప్పడం, ప్రతి ప్రాజెక్టును కూడా రీడిజైనింగ్‌ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్‌ ఇంజనీర్లనైనా సలహాతీసుకున్నాడా అంటే అదీ లేదన్నారు. అటు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఇటు నిపుణులను, రిటైర్డ్‌ అధికారులను లెక్కచేయకుండా తన ఇష్టారాజ్యంగా పనులు చేపడుతామంటే ఊరుకునేది లేదని ఉత్తమ్‌కుమార్‌ రఎడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కూడా కనీసం పెండింగ్‌ ప్రాజెక్టుల జోలికి రాని కేసీఆర్‌ నేడు రీడిజైనింగ్‌ పేరుతో డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ సహించదని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి హెచ్చరించారు. హుస్నాబాద్‌, మానకొండూర్‌ నియోజకవర్గాలకు ఉపయుక్తంగా ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌ రద్దుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలు రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసేందుకు తమపార్టీ ముందుంటుందన్నారు. తోటపల్లిని రద్దు చేసి సిద్దిపేటలో రిజర్వాయర్‌లను నిర్మిస్తామని చెప్పడం జలదోపిడికి పాల్పడడమే అవుతుందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఒంటెద్దు పోకడలతో తీసుకుంటున్న నిర్ణయాల వెనుకాల పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన ఏప్రాజెక్టునైనా రద్దు చేయాలని చూసినా, నిర్మాణం చేపట్టకపోయినా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల పొట్టగొట్టే నిర్ణయాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవడం జరుగుతుందని, ఒంటెద్దు పోకడలతో పోతున్న సీఎం వైఖరిపైతీవ్ర స్థాయిలో పోరాటాలు చేసి ప్రజల్లోకి తీసుకెల్తామని కరీంనగర్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. ధర్నాకు డీసీసీ అద్యక్షుడు కటకం మృత్యుంజయం నాయకత్వం  వహించగా, పార్టీ నేతలు హుస్నాబాద్‌, మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్‌, మాజీజడ్పీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్రరాజశేఖర్‌తోపాటు వివిద విభాగాల అధ్యక్షులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన కార్యకర్తలతో రాజీవ్‌ రహదారి కిటకిటలాడింది. ధర్నా భారీ వానలోనే ప్రారంభం కాగా చివరికి అరెస్ట్‌లతో ముగిసింది.