భారీ సభల ప్రయోజనం తెలిసిన నేత
ముందస్తు వ్యూహంలో విపక్షాల గిలగిల
అనుకున్నట్లుగానే ప్రగతినివేదన సభ సక్సెస్
హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి):ప్రగతి నివేదన సభ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కేసీఆర్‌కు బాగా తెలుసు. ఎన్నికలకు వెళ్లాలనుకునే పార్టీలు భారీ బహిరంగ సభ నిర్వహించడం రాకీయ పార్టీలకు కొత్తేవిూ కాదు. తన విజయావకాశాలకు ఏ మాత్రం ఢోకా లేకుండా చేసుకోవడానికై అవసరమైన అన్ని జాగ్రత్తలనూ ఆయన తీసుకున్నారు. ప్రజలకు వరాలు ప్రకటించడంతో పాటు అత్యంత భారీ జన సవిూకరణతో ప్రగతి నివేదన సభ నిర్వహణకు ప్లాన్ చేశారు.తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో నిర్వహించిన భారీ బహిరంగ సభలన్నింటికీ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆదివారంనాడు ప్రగతి నివేదన సభ పేరిట అత్యంత భారీగా జన సవిూకరణ చేయాలని కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. సభ ఎక్కడ జరగాలి? ఎలా ఉండాలి? వంటి విషయాలను ముందుగానే నిర్ణయించుకున్న కేసీఆర్ అందుకు అవసరమైన మేరకు సభను సక్సెస్ చేయించారు. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పార్టీ టికెట్ కోసంయత్నిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఆశావహులు కూడా పోటాపోటీగా జన సవిూకరణకు పూనుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో తన స్వాగత ఏర్పాట్ల ద్వారా ప్రజలలోకి దూసుకుపోయిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ ప్రగతి నివేదన సభ తర్వాత ముందస్తు ఎన్నికలలో తనకు తిరుగులేదని చెప్పారు. 25 లక్షల మందితో ప్రగతి నివేదన సభ జరుగుతుందని కేసీఆర్ ప్రకటించి అందిరి దృష్టిని ఆకర్శించి..ఆ మేరకు కృతకృత్యులయ్యారు. మరోవైపు కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే దాని ప్రభావం తనపౌ పడకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పాటు అందుకు అడ్డంకులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ కోలుకోలేదన్నది కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. అందులో భాగంగా తొలి అడుగు కింద ప్రగతి నివేదన సభను భారీగా నిర్వహిం చాలని కేసీఆర్ తలపోశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులలో కూడా ఈ భయం కనిపిస్తోంది. ముందస్తు ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల అడుగులు తడబడుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో సమరోత్సాహం కనిపిస్తోండగా, ప్రతిపక్షాలలో బేలతనం ప్రస్ఫుటంగా ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే నాలుగైదు నెలల ముందుగానే అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన కేసీఆర్‌ను ఢీకొనడానికి కాంగ్రెస్ పెద్ద గా ప్రయత్నాలు చేయడం లేదు. అందుకే నిశ్చింతగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధపడు తున్నారు. కెసిఆర్ అడుగులు ఎటు పడుతున్నాయన్నది గ్రహించి ప్రతిచర్యలు తీసుకోవలసిన ప్రతిపక్షాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి మరీ దయనీయం గా ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగితే కేసీఆర్‌కే లాభం! అయినా ఎందుకు సహకరిస్తున్నారని పార్టీ అధిష్ఠానం వద్ద వారు తమ గోడు వెళ్లబోసుకున్న తీరు వారి బేలతనాన్ని బయటపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ వంటి వారి సహకారం అవసరం అన్న వ్యూహంలో బిజెపి కేంద్ర నాయకత్వం ఉంది. ఇకపోతే పార్టీని గెలిపించడానికి తామున్నామని చెప్పగల నాయకుడు ఒక్కరు కూడా కాంగ్రెస్, బిజెపిల్లో కనిపించడం లేదు. కానీ పొరపాటు పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుదామను కుంటున్న వారికి మాత్రం కొదవలేదు. క్షేత్ర స్థాయిలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉండకుండా ఉంటుందా? అన్న ఆశతో మాత్రమే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రజలలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా దాన్ని తొలగించడానికై కేసీఆర్ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అడిగినవారిపై, అడగని వారిపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. పొత్తులపై ఆధారపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే విజయం సాధించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
————



