భూమి ధర పెరగడంతో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

తిమ్మాపూర్‌, నూస్‌లైన్‌: భూములకు మార్కెట్‌ ధర ఈనెల ఒకటినుంచి పెరగడంతో మార్చి నెలాఖరు ఆదివారం (సెలవురోజూ) కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయం తలుపులు మూసి, ఒకరి తర్వాత మరొకరిని పిలిపిస్తూ పని పూర్తి చేశారు. మిగతా రోజుల్లో దస్తావేజుపై ఏ ఒక్క సంతకం తక్కువున్నా.. క్రయ, విక్రయదారులు, సాక్షులు అంగీకరిస్తేనే సబ్‌ రిజిస్టార్‌ డాక్యుమెంట్‌ను అనుమతించేవారు. చార్జీలు పెరుగనున్న క్రమంలో అధికారులు నిబంధనలు విస్మరించారు. సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే సమాచారం మేరకు మీడియా అక్కడికి వెళ్లగా.. శనివారం నాటి దస్తావేజుల్లో పూర్తిస్థాయిలో సంతకాలు లేవని, వాటిని పూర్తి చేస్తున్నామని ఉద్యోగులు చెప్పడం గమనార్హ.

సిరిసిల్లలో వేకువజాము వరకు

సిరిసిల్ల రూరల్‌: పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆదివారం వేకువజాము వరకూ కొనసాగింది. ఒకేరోజు 200పైగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. స్థలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అధికారులు నిబంధనలుతుంగలో తొక్కారు. సబ్‌ రిజిస్ట్రేర్‌ లేకుండా.. క్రయ, విక్రయదారులు లేకున్నా… అందులో ఉన్న సిబ్బందితోనే ప్రక్రియ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సబ్‌ రిజిస్ట్రేరు అశోక్‌ను ‘న్యూస్‌లైన్‌’ వివరణ కోరగా స్కానింగ్‌ పక్రియ ముగిసిందని, అన్ని డాక్యుమెంట్లకు నంబరు ఇచ్చాకే బయటకు వచ్చానన్నారు.