భూ రికార్డుల్లో లోపాలవల్లే కబ్జాలు

– అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి
– ఏపీ డిప్యూటీసీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
కడప, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  రాష్ట్రంలో భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్లనే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. గురువారం కడప కలెక్టరేట్‌లో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అనే అంశంపై సవిూక్ష నిర్వహించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు పిల్లి శుభాష్‌ చంద్రబోస్‌, అంజద్‌ బాషా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాథరాజు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, కడప జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ పరిపాలన సక్రమంగా జరగాలంటే అధికారులంతా చిత్తుశుద్ధితో పని చేయాలని చంద్రబోస్‌ అన్నారు. కబ్జాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేయాలని చంద్రబోస్‌ కోరారు. కడప జిల్లాలో పేదలకు ఇవ్వడానికి అవసరమైన ప్రభుత్వ భూమిని సేకరించినట్లు అధికారులు చెప్పడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మేలు జరిగేలా జగన్‌ పాలన సాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని వర్గాలకే పాలన ఫలాలు అందాయని, ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారు ఎవరైనా ప్రభుత్వ ఫలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే వారికి వెంటనే పథకాల ఫలాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.