భూ సర్వే చేసి కచ్చితమైన రికార్డులు తయారు చేస్తాం-జోగురామన్న

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ఎద్దు ఎడిచే వ్యవసాయం, రైతు ఎడిచే రాజ్యం బాగుండదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. భూములను సర్వే చేసి కచ్చితమైన రికార్డులను తయారు చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చందాటి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల ఎన్నిక కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 20 మందితో రైతు సమన్వయ కమిటీ జాబితాను ప్రభుత్వానికి పంపి అందులో 15 మందిని ఎంపిక చేయనున్నారు. అనంతరం మంత్రి

మాట్లాడుతూ గత పాలకులు పట్టించుకోకపోవడంతో వ్యవసాయం దండగ అనే భావన నెలకొందన్నారు. అయితే సీఎం కేసీఆర్‌ రైతు ల కష్టనష్టాలను ఆలోచించి వచ్చే ఖరీఫ్‌ నుంచి ఎకరానికి 4 వేల చొప్పున నగదును అందిస్తామన్నారు. దీంతో రైతులను పంట పెట్టుబడుల ఆర్థిక భారం నుంచి కొంతైనా బయటపడేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని రూపు మాపేందుకు పకడ్బందీగా భూ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చేతి వృత్తుల కులాల బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి జోగురామన్న అన్నారు. గోర్ల కురుమల కోసం గొర్రెల యూనిట్లు, గంగ పుత్రుల కోసం చేపల పంపిణీ తదితర పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. బంగారు తెలంగాణ అంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నామన్నారు. అయితే కొందరు ప్రతి పక్షాల నాయకులు ప్రభుత్వం ఏమి చేయడం లేదని ఆరోపించడం విడ్డురంగా ఉందని జోగురామన్న వ్యాఖ్యానించారు