భేటీ అయిన మూడుపార్టీలనేతలు

సుప్రీం తీర్పును స్వాగతించిన శరద్‌ పవార్‌

ముంబయి,నవంబర్‌26(జనం సాక్షి): మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలోఓ మరోమారు శివసేన, ఎన్సీపి కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూమంపై వీరు చర్చిస్తున్నారు. మహారాజకీయాల విషయంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను సుప్రీంకోర్టు పరిరక్షించినందుకు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌.. న్యాయస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం నాడు మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు పవార్‌ నివాళులర్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలతో రాజకీయాలపై సాధించిన విజయం ఇది అని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీం ఇచ్చిన తీర్పు మహారాష్ట్ర ప్రజలకు కానుక అని తెలిపారు. ఓపెన్‌ బ్యాలెట్‌ పద్ధతిన బలపరీక్ష నిర్వహించడం శుభపరిణామం అన్నారు. మహారాష్ట్రలో సత్యమే వర్ధిల్లుతుంది. జై హింద్‌, జై మహారాష్ట్ర అని సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు.