భౌతిక దూరం పాటించి దసరా శుభాకాంక్షలు
ఎక్కడా కానరాని ఆడంబరాలు
వరంగల్,అక్టోబర్26(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రతియేటా ప్రజలందరూ గుమిగూడి జమ్మి చెట్టుకు పూజలు చేయడం, పాలపిట్ట దర్శనాలు చేసుకోవడం జరిగేది. అయితే ఈసారి జిల్లావ్యాప్తంగా అలాంటి ఏర్పాట్లు ఏమి జరగలేదు. కరోనా కారణంగ ఆప్రజలు భౌతిక దూరం పాటించి, ఆలింగనాలకు స్వస్తి చెప్పారు. షేక్ హ్యాండ్‌లు కూడా మరిచి పోయారు. కేవలం మాస్కులు ధరించి హాయ్ అని చేయి ఊపడం, దండంతో సరిపెట్టారు. పలు గ్రామాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా ప్రతియేటా దసరా ఉత్సవాలు వైభవంగా జరిగేవి. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జమ్మి చెట్టుకు పూజలు చేసి పాలపిట్ట దర్శనం చేయించేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు గుమిగూడరాదన్న ఉద్దేశంతో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఈసారి బతుకమ్మ పండుగను కూడా నిరాడంబరంగా జరుపుకున్నారు.
దసరా సందర్భంగా వాహనాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆయుధ పూజలో భాగంగా వాహనాలకు పూల దండలు వేయడం, గుమ్మడికాయలు కొట్టడం చేస్తారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో బంతి పూలను రూ.200 నుంచి రూ.250 వరకు కిలో చొప్పున విక్రయించారు. గుమ్మడికాయలను సైజును బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు అమ్మారు. వ్యాపారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మడంతో గిరాకీని బట్టి రేట్లను నిర్ణయించారు. ఏడాదికోసారి నిర్వహించే ఆయుధ పూజ కావడంతో ఎంత ధరైనా ప్రజలు కొనుగోలు చేశారు. మొత్తంగా కరోనా ఎఫెక్ట్ బతుకమ్మ, దసరాలపై స్పష్టంగా కనిపించింది.