భౌ భౌ చింత.. బడ్జెట్ లేదంట..!! కుక్కల నియంత్రణ లేక “బోడుప్పల్” బదనాం అన్ని డివిజన్లలో అడుగు బయట పెడితే దడదడే..

కాలనీలపై పంజా.. పిల్లలకు ప్రాణ సంకటం
మేడిపల్లి – జనంసాక్షి
“నా పిల్లలు సాయంత్రం కాగానే బయట చక్కగా ఆడుకునేవారు. కానీ గత కొంతకాలంగా వారికి తాళం వేసినట్టయ్యింది. ఎందుకంటే.. అడుగు బయట పెడితే భయం భయం. ఏ కుక్క ఎటువైపు నుంచి వచ్చి పిక్క పడుతుందో తెలియదు. గుంపులుగుంపులుగా అవి సంచరిస్తూ కాలనీవాసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి” – ఇది బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలోని సగటు ఓ తండ్రి, ఓ తల్లి, ఓ తోబుట్టువు ఆందోళన..!
బోడుప్పల్ కార్పోరేషన్ అధికారుల తీరు మారలేదు. ప్రాణాల మీదకొచ్చినా తమకేమీ పట్టదన్న చందంగా వారి వ్యవహారం తయారైంది. గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద వేధిస్తోంది మహాప్రభో అని వేడుకుంటున్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఇక్కడి పాలకవర్గం, అధికార యంత్రాంగం తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎటువైపు నుంచి ఏ కుక్క మీదొచ్చి పడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ప్రతి డివిజన్ లో 70కుక్కల చొప్పున నియంత్రణ చర్యలు చేశామని అధికారులు చెప్తున్నా.. వారి మాటలు అసలు లెక్కకు రావడం లేదు. కార్పొరేషన్ వ్యాప్తంగా మొత్తం 600 కుక్కలకు నియంత్రణ పద్ధతులు పాటించామని వారంటున్నా… ఈ లెక్కలు విన్నవారు గొల్లున నవ్వుతున్నారు. ఒక్కో డివిజన్ లో అధికారుల లెక్కప్రకారం 70చొప్పున కుక్కల నియంత్రణ పద్ధతులు పాటించినా.. ఇక్కడున్న మొత్తం 28 డివిజన్లలో 1960 కుక్కలకు శాస్త్ర చికిత్స చేయాలి. కానీ అధికారుల లెక్కల మేరకు 600 కుక్కలకే చేసినట్టు చెప్పడం పట్ల కాలనీవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు వాటికి కూడా చేశారా లేదా అని ప్రశ్నలు సందిస్తున్నారు.
వేలల్లో కుక్కలు.. రోజూ తిప్పలు
బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలో కుక్కల నియంత్రణ కోసం ఒక్కో కుక్కకు రూ.1600 ఖర్చు చేసినట్టు సమాచారం. మొత్తం 600 కుక్కలకు 9లక్షలా 60వేలు ఖర్చయినట్టు తెలిసింది. అయితే.. 28 డివిజన్లలో ఒక్కో డివిజన్ లో కనీసం పదికిపైగా కాలనీలు ఉండగా.. ఒక్కో కాలనీలో 15 వరకు కుక్కలు సంచరిస్తున్నాయి. ఈ లెక్కన మొత్తం డివిజన్ లో 150కి పైగా గ్రామ సింహాలు కనబడుతున్నాయి. మొత్తం 28 డివిజన్లలో కలిపి వేల సంఖ్యల్లో కుక్కలు ఉంటాయని కాలనీ, డివిజన్ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. వీరి అంచనా, అధికారుల లెక్కలకు అసలు పొంతన లేదనే చర్చ మొదలైంది. 3వ డివిజన్లో 76 కుక్కలకు చికిత్స చేశామని అధికారులు తెలపగా.. కనీసం అక్కడ 200 కుక్కలు ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఈ లెక్కన కుక్కల నియంత్రణ అన్నిటికీ ఎలా పూర్తి చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..!
పిల్లల ప్రాణాలకు లెక్కలేదా..?
బొడుప్పల్ కార్పోరేషన్ పరిధిలో అత్యధికంగా చెంగిచెర్లలో కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. మొదటి, రెండో, మూడో డివిజన్లలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు తిరుగుతున్నాయి. పిల్లలను బయటకు పంపాలంటేనే కన్నవాళ్లు జంకుతున్నారు. కాలనీ సంఘాల ప్రతినిధులు, స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టి సమస్య పరిష్కారానికి దారి చూపాలని కోరుతున్నారు. కుక్కల నియంత్రణ కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తేనే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తుండగా.. ఆ దిశగా అడుగులు పడతాయో లేదో వేచి చూడాలి మరి.
Attachments area