భ్రష్టుపట్టిన నాయకులా జర్నలిస్టుల నీతిని ప్రశ్నించేది?

అక్రమార్కులపై కత్తి గుచ్చేది.. మానవీయ కథనాలతో కన్నీరు తుడిచేది పాత్రికేయుడే..
ఒక్క ఓటు కూడా నిజాయితీగా ఓటు వేయించుకోలేనివారు అలా మాట్లాడటం హాస్యాస్పదం
పత్రికకు ఎడిటరే శిరస్సు అని గౌరవించిన నిఖార్సైన పాత్రికేయుడు రహమాన్‌
పేరులోనే జనం నింపుకొన్న ‘జనంసాక్షి’ బడుగుబలహీన పక్షాన నిలబడాలి
12 ఏండ్ల ‘జనంసాక్షి జాతర’లో ప్రముఖ జర్నలిస్టు సతీష్‌ చందర్‌ ఉద్ఘాటన
రాబోయే కొన్నేండ్లలో డిజిటల్‌ మీడియాకు మరింత ప్రాధాన్యత : టీ10 సీఈఓ సుందర్‌
హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి)
ప్రస్తుతం ఏదేని ఒక పత్రికను సమగ్రంగా చదివినా అందులో విషయం పాఠకుడికి అర్థంకాదని, రెండు మూడు పత్రికలు చదివితేగానీ కామన్‌ పాయింట్‌ తెలిసే పరిస్థితి లేదని ప్రముఖ జర్నలిస్ట్‌ సతీష్‌ చందర్‌ స్పష్టం చేశారు. పత్రిక మ్యాచింగ్‌ ఫజిల్‌ ఇస్తే ఏ పత్రిక ఏ పార్టీదో ఇట్టే చెప్పగలరని అన్నారు. అయితే తనపేరులో జనాన్ని నింపేసుకున్న ‘జనంసాక్షి’ ప్రజల పక్షం వహించాలని, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, బలహీనవర్గాలు, పల్లెవాసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య హాస్టల్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ‘12 ఏండ్ల పండుగ.. జనంసాక్షి జాతర’ పేరిట విలేకరులు, సిబ్బంది శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భ్రష్టుపట్టిన రాజకీయ నాయకులు జర్నలిస్టుల నీతిని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఒక్క ఓటు కూడా నిజాయితీగా వేయించుకోలేని నాయకులు పాత్రికేయుల గురించి మాట్లాడటం తగదన్నారు. రాజకీయ నేతల్లో నిజాయితీపరులు కాగడ పెట్టి వెతికినా దొరకరని, అన్నిరంగాల్లో నీలినీడలు విస్తరించినట్టే కొంతమేర జర్నలిజంలో కూడా ఉండి ఉండొచ్చని, అయితే నిజాయితీతో కూడినవారు అనేకమంది ఉన్నారని తెలిపారు. జర్నలిజం వృత్తిని ఎంచుకున్నవారు అంతకంటే ఉన్నతి అవకాశాలు దొరికినా వృత్తిని వదులుకోలేరని, ఇందులో ఉండే గౌరవం, ప్రశ్నించేతత్వం అలాంటిదని చెప్పారు. వృత్తిని వదిలేసుకున్నవారు చాలా అరుదన్నారు. అక్రమార్కులకు కత్తి గుచ్చినట్టు.. మానవీయ కథనాలతో కన్నీరు తుడిచినట్టు పాత్రికేయులు మాత్రమే పనిచేయగలరని స్పష్టం చేశారు. జర్నలిస్టుల మానవీయ కథనాల ఫలితంగా ప్రభుత్వం ఎన్నో స్కీములు తెచ్చిందని, ఆరోగ్య శ్రీ, ఇతర స్కీములు అందులో భాగమేనని ఉదహరించారు.

అందుకే రహమాన్‌ ఎడిటరయ్యాడు..
ఒక పత్రికకు ఎడిటరే శిరస్సు అని భావించి.. యాజమాన్యాల కంటే ఆ శిరస్సునే గౌరవించిన రహమాన్‌ తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారని సతీష్‌ చందర్‌ అన్నారు. సాహసోపేతమైన జర్నలిస్టుగా ఆయన ముద్రవేసుకున్నారని గుర్తుచేశారు. సంచలన కథనాలు రాసి సమాజంలో ఎన్నో మార్పులకు ఆయన దోహదపడ్డారని వివరించారు. శిరస్సును గౌరవించాడు కాబట్టే ఎడిటర్‌ అయ్యాడని అభివర్ణించారు. తన శక్తియుక్తులన్నీ కూడదీసి జనంసాక్షిని జనంలోకి తీసుకెళ్లారని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించగలిగారని చెప్పారు.

ఎడిటర్‌ రహమాన్‌ మాట్లాడుతూ.. ప్రతి జర్నలిస్టు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక కథనాలు రాస్తూ ఉత్తమ పాత్రికేయుడిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. స్థానిక పత్రికగా ఆరంభమైన జనంసాక్షి.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిందని, ఉద్యమ అవసరాల కోసమే ఈ పత్రిక పుట్టిందనిగుర్తుచేశారు. ప్రత్యేకంగా దళితులు, ఆదివాసీలు, మైనార్టీల పక్షాన నిలిచిందన్నారు. ఓ నిరుపేద అమ్మాయి డాక్టరయ్యేందుకు ‘జనంసాక్షి’ ముందు నిలిచిందని ఈ సందర్భంగా వెల్లడిరచారు.

డిజిటల్‌, సోషన్‌ మీడియాదే భవిష్యత్‌ : సుందర్‌, టీ10 సీఈఓ
మీడియా రంగంలో పనిచేసే ప్రతి ఒక్క పాత్రికేయుడూ డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా పట్ల అవగాహన కలిగి ఉండాలని టీ10 సీఈఓ సుందర్‌ చెప్పారు. దీనివల్ల లాభాలెన్నో నష్టాలు కూడా అంతే ఉన్నాయని, అయితే తగిన జాగ్రత్తలతో మన గమ్యం చేరుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌, వాట్సాప్‌ తదితర మాధ్యమాల్లో జనంసాక్షి పేపర్‌ను ఏ విధంగా షేర్‌ చేయాలో వివరించారు. ఈ సందర్భంగా పాఠకులను చేరుకునేందుకు తగిన సలహాలు సూచనలందించారు. ఫేస్‌బుక్‌ పేజీ, యూట్యూబ్‌ వ్యూయర్స్‌ వేల సంఖ్యల్లో ఉండటం అభినందనీయమన్నారు. సాంకేతిక, డిజిటల్‌ రంగం పెరుగుతున్నా కొద్దీ మనమూ అప్‌డేట్‌ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేదంటే మరుగునపడిపోతామని హెచ్చరించారు. మరో ఐదు నుంచి పదేళ్లలో ఇప్పుడున్న ఫోన్లు కూడా పనిచేయబోవని, మరింత టెక్నాలజీ పెరిగి అప్‌డేట్‌ వర్షన్స్‌ అందుబాటులోకి వస్తాయని, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో జనంసాక్షి నిర్వహించబోయే ఇలాంటి శిక్షణా తరగతుల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ముందుకొస్తానని సుందర్‌ అన్నారు.