భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు
కరీంనగర్ 12, జూన్ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్లో జరిగిన మాజీ మంత్రి,చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయానుభవం గల తాను రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనాన్ని చూడటం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న నాయకులు ఉప ఎన్నికల్లో ఓట్లను కొన్నారని, ఆ సొమ్ముతో బెట్టింగ్‌లు కాయడం దారుణమన్నారు.అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై ఉద్యమించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు విత్తనాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని బాబు స్పష్టం చేశారు.రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. పత్తి విత్తనాలను పూర్తి స్థాయిలో రైతులకు సబ్సిడీపై అందించాలని కోరారు. కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మన రైతులు నాణ్యమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటున్న అధికార పార్టీ ఇదేనా రైతులకు చేసే మేలు అని ప్రశ్నించారు. పత్తి, వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని వైఎస్ఆర్ నిలువునా దోచేశాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిపరుస్తామని అన్నారు. వృద్ధులను ఆదుకుంటామని చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాధం, వివేక్, టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, గండ్ర నళిని, వెంకటేశ్వరరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.