మంత్రి కొడాలి నానిపై.. కేసు నమోదు చేయండి

– తిరుపతిలో నానిపై బీజేపీ నేతల ఫిర్యాదు
చిత్తూరు, నవంబర్‌19(జనం సాక్షి) : ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా తిరుపతిలో బీజేపీ నేతలు నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, డిక్లరేషన్‌ విషయంపై మంత్రి వ్యాఖ్యలు సరికావని నేతలు పేర్కొన్నారు. చట్టాలు చేసే మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని వారు  ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే అర్చక, హిందూ సంఘాలు కూడా నాని తీరుపై మండిపడ్డాయి. మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. డిక్లరేషన్‌ అనేది ఎన్నో ఏళ్లగా వస్తున్న సంప్రదాయమని.. మంత్రి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు. అసలు వివాదం విషయానికి వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి.. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై మంత్రి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.