మంత్రి పొన్నాలకూ సర్కారు అండ
న్యాయసహాయం కోసం ఉత్తర్వులు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో వివాదాస్పద జోవోల జారీపై సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రుల మాదిరే ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు న్యాయసహాయం అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది నియామకంతో పాటు ఇతర ఖర్చులకు ఐటీ శాఖ భరించాలని సూచించింది. వై.ఎస్ ప్రభుత్వ హయాంలో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రయోజనాల కోసం ఇచ్చిన నీటి కేటాయింపు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు పొన్నాలకు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోల గురించి ఇప్పటికే సీబీఐ ఆయనను ప్రశ్నించింది. మంత్రులు సబితారెడ్డి, ధర్మాన ప్రసాధరావు, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డిలకు న్యాయసహాయం కోసం ఈ నెల ఏడో తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన పేరు లేకపోవడంతో మంత్రి పొన్నాల మరోసారి సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీఎం ఆయనకు న్యాయసహాయం అందించేందుకు అనమతించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో మంత్రి మోపిదేవీ వెంకటరమణ న్యాయసహాయంపై న్యాయశాఖ నుంచి అనుమతి రాలేదు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఎనిమిది మంది ఐఏఎస్‌లకు న్యాయసహాయంపై ఒకటి, రెండు రోజుల్లో ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావచ్చని అధికారివర్గాలు తెలిపాయి.