మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

మంథని (మహదేవపూర్‌), న్యూస్‌లైన్‌: మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పర్యటించారు. కాటారం, మహాముత్తారం మండలాల మీదుగా మహదేవపూర్‌ మండలంలోని ముకునూరు గ్రామానికి తెల్లవారక ముందే ఆయన చేరుకున్నారు. సమస్యాత్మక గ్రామాలైన ముకునూరు, తిమ్మేటిగూడెం, గొర్రాయిగూడెం, వెంచంపల్లి , నీలంపల్లి, బూర్గుగూడెం, దమ్మూరులో సాయంత్రం వరకు పర్యటించారు. ఆయా గ్రామాల్లో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాత్రి మారుమూల గ్రామమైన పలిమెలలో నిద్రించారు. ముకునూరు నుంచి పలిమెల వరకు పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసుల రక్షణలో పర్యటించారు. ఆయా గ్రామాలకు గోదావరినది అవతల కూతవేటు దూరంలో మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలున్నాయి. అవతలివైపున మావోయిస్టుల  ప్రాబల్యం అధికం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మంత్రి పర్యటన ఉత్కంఠ పరిస్థితుల నడుమ సాగింది.

తరలిన అధికార గణం

మంత్రి పర్యటనలో జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌, ఓఎస్డీ సుబ్బారాయుడు, డీఆర్డీఏ పీడీ, ఇన్‌చార్జి డీపీఓ శంకరయ్య, డ్వామా పీడీ మనోహర్‌, డీఎంహెచ్‌వో కె. నాగేశ్వర్‌రావు , ఐసీడీఎస్‌ పీడీ రాములు, డీఈవో కె.లింగయ్య, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, పశుసంవర్ధకశాఖ జేడీ సుభాష్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ నర్సింహారావుతోపాటు హార్టికల్చర్‌ జేడీ, పంచాయతీరాజ్‌, అర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, ఈఈలు, మంథని ఆర్డీవో ఆయేషాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు

మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఓఎస్డీ సుబ్బారాయుడు ప్రత్యేక్ష పర్యవేక్షణలో గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాటారం సీఐ రాములు బందోబస్తును నిర్వహించారు. పలువురు సీఐలు, ఎస్సైలతో పాటు దాదాపు మూడు వందల మంది జిల్లా సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు.