మక్క రైతులకు భరోసా ఏదీ?
జనగామ,నవంబర్25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు వస్తున్నాయో లేదో జనగామ మార్కెట్‌కు వస్తే రైతుల అవస్థలు తెలుస్తాయని సిపిఎం జిల్లా నాయకుడు జిల్లెల సిద్దారెడ్డి అన్నారు. రైతులు మార్కెట్లలో పడిగాపులు పడుతున్నా అధికార పార్టీ నేతలు
పట్టించుకోవడం లేదన్నారు. మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్లో వ్యాపారులు, అధికారులు రైతులకు సహకరిస్తున్నారా? లేదా? అనే వివరాలు రైతుల నుంచి సేకరించారు. రైతులకు మేలు జరుగుతుందనే సదాశయంతో కేంద్రం నామ్‌ను ప్రవేశపెడితే అమలులో రాష్ట్ర సర్కారు అడుగడుగున తూట్లు పొడుస్తూ నామ్‌ను నామమాత్రంగా మార్చిందని ఆరోపించారు. గత వారంతో పోల్చితే మొక్కజొన్న ధర భారీగా తగ్గినప్పటికీ, రైతులకు భరోసా కల్పించేవారే కరవయ్యారన్నారు. ప్రభుత్వం చెబుతున్న తీరు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు