మతమౌడ్యం దేశానికి పెను విఘాతం

5

– 125 కోట్ల మంది భారతీయులు టీమిండియాగా పనిచేద్దాం

– పేదరిక నిర్మూలనకు కృషి చేద్దాం

– స్వచ్ఛ భారత్‌కు బాలలే అంబాసిడర్‌

– ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌15(జనంసాక్షి): మత మౌడ్యం దేశానికి అత్యుంత ప్రమాదకరమని ,జాతి ఐక్యతను దెబ్బతీసే కులమతాలకు తావు లేకుండా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

దేశంలో పేదరికాన్ని పారద్రోలడమే టీమిండియా లక్ష్యమని,  69వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసంఖ్యాక వీరుల బలిదానాల ఫలితం మనం అనుభవిస్తున్న  ఈ స్వాతంత్య్రమన్నారు.  ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, జీవితాల్ని జైలుకు అంకితం చేసి సాధించిన త్యాగఫలమిదన్నారు. 125 కోట్ల మంది భారత ప్రజలకు నూతన సూర్యోదయమిదని అన్నారు.  భిన్నత్వంలో ఏకత్వమన్న భారతతత్వం ప్రపంచానికే దిక్సూచి. దేశకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని యువతను ఈ సందర్భంగా కోరుతున్నాని ప్రధాని అన్నారు. దేశంలో ఒక ఉద్యమంగా వ్యాపించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్‌ ప్రతి భారతీయుడినీ కదిలించిందని చెప్పారు. గతంలో తాను ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడితే ఈయనేం ప్రధాని అంటూ ఎద్దేవా చేశారన్నారు.  ఇవాళ దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ ఉద్యమం వూపందుకుందన్నారు. సెలబ్రిటీలు, నాయకులు… స్వచ్ఛభారత్‌ అంబాసిడర్లు కాదు, విూ ఇంట్లోని 10-15 ఏళ్ల పిల్లలే స్వచ్ఛభారత్‌ అంబాసిడర్లు అని వ్యాఖ్యానించారు. గాంధీజీ 150వ జన్మదినం నాటికి స్వచ్ఛభారతాన్ని ఆ మహనీయునికి అంకితం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్షా బీమా యోజన కొత్త మార్గాలు తెరిచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.బీమా అంటే తెలియని అట్టడుగు వర్గాలకు ధీమా లభించిందన్నారు. భారత అభివృద్ధి పిరమిడ్‌ ఆర్థిక శక్తి విూద ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పుడు చిన్నారులే స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారంటూ ఇళ్లను స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను బాలలు స్వీకరించారని వారిని అభినందించారు. అటువంటి బాలలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్న ప్రధాని, అభివృద్ధి నినాదంతో వీటన్నింటినీ భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ మతఛాందస వాదానికి  ఎటువంటి పరిస్థితుల్లో తావుండకూడదని స్పష్టం చేశారు. మన ఐక్యత దెబ్బతింటే కలలన్నీ కల్లలవుతాయి. కులం, మతం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. పేదరికాన్ని పారద్రోలడమే మన టీమిండియా లక్ష్యం. అభివృద్ధి అన్న కొత్త నినాదంతో వీటన్నింటీని భూస్థాపితం చేయాలి. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానం. మన ఆలోచనలు, ప్రణాళికలు దేశాభివృద్ధికి కొత్త దారులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి అంటే ఒక ప్రాంతం అభివృద్ధి కాదు. దేశ పశ్చిమతీరం అభివృద్ధి చెందితే సరిపోదు, మా దృష్టి తూర్పు

తీరంపైనేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. బిహార్‌, బంగాల్‌, అసోం, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి తమ లక్ష్యమని వివరించారు. వ్యవసాయశాఖ పేరును వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మారుస్తామని ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి పలు దశాబ్దాలు గడిచినా 18,500 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు. వచ్చే వెయ్యి రోజుల్లో 18,500 గ్రామాల్లోవిద్యుత్‌ సరఫరా కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థల సహకారంతోనే దీన్ని సాధించగలుగుతామన్నారు. దేశంలో స్టార్టప్‌లు ప్రారంభంకాని జిల్లాలు, బ్లాక్‌లు లేకుండా చూస్తామన్నారు.

దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 125 కోట్లమంది భారతీయులు టీమిండియాగా పనిచేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామన్న ఆయన, మన పథకాలు, వ్యవస్థలు వారికి ఉపయోగపడాలన్నారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పేదలను ఆర్థికంగా బలోపేతం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా ఉండదన్నారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానమంటూ భారత్‌ సమున్నత శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ప్రణాళికలు, ఆలోచనలు దేశాభివృద్ధికి కొత్తదారులు వేయాలన్న ప్రధానమంత్రి, జన్‌ధన్‌ యోజన మంచి ఫలితాలనిచ్చిందని, ఒక్క పిలుపుతో పేదలంతా బ్యాంకు ఖాతాలు తెరిచారని తన హర్షాన్ని తెలియజేశారు. ఊహించినదానికి భిన్నంగా 20 వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమయ్యాయంటూ ఇది భారత పేదలు సాధించిన విజయమని పేర్కాన్నారు. నెలకు ఒక రూపాయితో బీమా పథకం ప్రవేశపెట్టామని, ఫలితంగా 100 రోజుల్లో 10 కోట్ల కుటుంబాలు బీమా పథకంలో చేరాయని తెలిపారు. దేశ సమగ్రతకు జాతి ఐక్యతే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సమరయోధుల త్యాగ ఫలితమైన ఈ స్వాతంత్య్రపు నిజమైన అర్థాన్ని గ్రహించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారత తత్వమే ప్రపంచానికి దిక్సూచిగా ఉందన్నారు. అసంఘటితరంగ కార్మికులకు కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వటం ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కార్మికులకు అందాల్సిన అన్ని సౌకర్యాలు ఈ గుర్తింపు కార్డుతో లభిస్తాయన్నారు. గ్యాస్‌ రాయితీ తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్యాస్‌ సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న నిర్ణయం గొప్ప ఫలితాన్నిచ్చిందన్నారు. ఈ నిర్ణయంతో దళారుల దుకాణాలు మూతపడ్డాయని, ఏటా రూ.15వేల కోట్లు ఆదా అవుతున్నాయన్నారు. అవినీతి నిర్మూనలో ఇది గొప్ప ముందడుగని అభివర్ణించారు.

నెహ్రూతో మొదలైన ఎర్రకోట సంప్రదాయం

ప్రతియేటా స్వాతంత్య్రదినోత్సవం నాడు దిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగుర వేయడం పండిట్‌ నెహ్రూ నంచి ఆనవాయితీగా వస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్దించగానే ఎర్రకోటపై నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ త్రివర్ణ పతాకాన్‌ఇన ఎగురవేశారు. అనంతరం ప్రతయేటా ఇక్కడి నుంచి స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభం అవుతూ వచ్చాయి.   భారతదేశానికి స్వతంత్రం ప్రకటించిన అనంతరం 1947 ఆగస్టు 15న మొదటి ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులైన జవహర్‌లాల్‌ నెహ్రూ ఎర్రకోటలోని ప్రధాన ప్రవేశద్వారం లా¬రీ గేట్‌పై జాతీయ జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి భారత ప్రధానులు ఎర్రకోటపై యేటాస్వాతంత్య్ర దినోత్సవానికి జెండా

వందనం చేయడం సంప్రదాయంగా మారింది.మొఘలుల కాలంలో నిర్మితమైన ఎర్రకోట భారత స్వాతంత్య్ర పోరాట పటిమకు సజీవ సాక్ష్యంగా ఉంది. చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన ఎర్రకోటపై ఇప్పటి వరకు మన దేశ ప్రధానులు  అధికారంలో ఉన్న సమయంలో  జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ అయ్యింది. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఈ ప్రఖ్యాత కట్టడం వారి అధికారిక కేంద్రంగా ఉండేది. మొఘలుల పాలన అంతమయ్యాక బ్రిటిష్‌ వాళ్లు ఎర్రకోటను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అత్యధికంగా  జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశ తొలి ప్రధాన మంత్రి అయ్యాక, ఆ తరవాత  ఆయన తన పదవీకాలంలో 17 సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఆ తరవాతి స్థానంలో ఆయన తనయ ఇందిరా గాంధీ 16 సార్లు ఎగరవేశారు. ఆ తరవాత రాజీవ్‌, పివి నర్సింహారావు, విపి సింగ్‌, దేవేగౌడలు కూడా ఇక్కడి నుంచి జెండా ఎగురవేవారు.  మన్మోహన్‌ సింగ్‌ 10సార్లు జెండా వందనం చేశారు. అటల్‌బిహారి వాజ్‌పేయీ ఆరు సార్లు జెండా ఎగురవేశారు.  భారత ప్రధానులుగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ గుల్జారిలాల్‌ నంద, చంద్రశేఖర్‌లకు ఎర్రకోటపై జెండా ఎగురవేసే అవకాశం రాలేదు. వారు ఉన్నది కేవలం తక్కువ కాలమే కావడం, పంద్రాగస్ట్‌ సమయాల్లో వారు ప్రధానులుగా లేకపోవడంతో అవకాశం దక్కించుకోలేదు.