మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించాలి
మద్యం లాటరీ కేంద్రాల వద్ద విపక్షాల ఆందోళన
పలువురి అరెస్టు
కొనసాగిన అరెస్టులు..లాఠీచార్జీ
హైదరాబాద్, జూన్ 26 : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘాలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా మద్యం లాటరీ కేంద్రాల వద్ద విపక్షాలు నిరసన తెలిపాయి. పోలీసులు అడ్డుకున్నారు.. కొనసాగిన అరెస్టులు.. సంగారెడ్డి, తిరుపతిలో స్వల్ప లాఠీచార్జి. వివరాల్లోకి వెళితే..లాటరీ పద్ధతిని ఎత్తివేయాలని, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ విపక్షాలు గళమెత్తాయి. లాటరీ ప్రక్రియ కొనసాగే కేంద్రాల వద్ద సిపిఐ, సిపిఎం, టీడీపీ, లోక్‌సత్తా, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. హైదరాబాద్‌నగరంలోని నాగోలులోను, ఖైరతాబాద్‌లోను నిర్వహణ కేంద్రాల వద్ద సిపిఐ, సిపిఎం, టీడీపీ, లోక్‌సత్తా ఆందోళన చేపట్టాయి. ఖైరతాబాద్ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, తదితరులను అరెస్టు చేశారు. నాగోలులో టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. విశాఖపట్నం రామాటాకీసు వద్ద ఉన్న కేంద్రంలో లాటరీ ప్రక్రియను అడ్డుకునేందుకు ఆందోళనకారులు యత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నగరంలో మరో కేంద్రం వద్ద సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్‌లోని హన్మకొండ ఎక్సయిజ్ కార్యాలయం వద్ద టీడీపీ, సిపిఐ, సిపిఎం, తదితరులు ఆందోళన నిర్వహించారు. ఎంపి గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. అలాగే మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎక్సయిజ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిపిఐ ఆధ్వర్యంలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిద్దర్ని ఆసుపత్రికి తరలించారు. అందుకు నిరసనగా ఆందోళనకారులు అక్కడే ఉన్న పోలీసు జీపును ధ్వంసం చేశారు. తిరుపతిలోని ఎక్సయిజ్ కార్యాలయం వద్ద, లాటరీ కేంద్రం వద్ద బిజెవైఎం, సిపిఎం, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మద్యం రహిత పట్టణంగా ప్రకటించాలని డిమాండు చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖమ్మంలోని ఎక్సయిజ్ కార్యాలయం వద్ద, లాటరీ కేంద్రం వద్ద సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కర్నూలు పట్టణంలోని జడ్‌పి కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోనూ అదే తీరు. చిత్తూరులో సిపిఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్‌లోనూ ఆందోళన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం దుకాణాల లీజుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ఏలూరులో ప్రారంభమైన లాటరీ విధానాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ, ఇతర పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఏలూరు సమీపంలోని దొండపూడి గ్రామంలో కళ్యాణ మండపం వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించిన ఆయా పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట కూడా జరిగింది. 100 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా విజయవాడ, బందరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి.