మద్యం మత్తులో యువత
దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నియంత్రణ, బార్ల కుదింపు వంటి చర్యల కారణంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎపి సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే పక్కనే యానం, ఇటు తెలంగాణలో మద్యం తక్కువ ధరలకే దొరకడంతో ఇప్పుడు చాలామంది దృష్టి ఇటువైపు పడింది. గతంలో ఎప్పుడూ లేనంతగా యువత మద్యం మత్తులో చిత్తవుతోంది. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి కారణాలతో యువత పెడదారి పడుతోంది. ఇకపోతే గంజాయి ఈ మధ్య భారీగా పట్టుబడడం చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. మద్యం, గంజాయి, చీప్ లిక్కర్, నాటుసారా తయారీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజికి అశాంతి నెలకొనే దుస్థితి ఏర్పడింది. ఇటీవల గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి పట్టుబడుతోంది. ప్రధానంగా ఇక్కడి నుంచి మహారాష్ట్ర,తమిళనాడుల నుంచి విదేశాలకు గంజాయి రవాణా అవుతోంది. పోలీసలు దాడులతో గంజా పట్టుబడుతోంది. ప్రధానంగా మన్యం కేంద్రంగా గిరిజన గూడాల్లో గంజాయి సాగు జోరందుకుంది. దీనికి డిమాండ్ ఉండడంతో కొందరు అమాయక గిరిజనులకు డబ్బు ఎరగా వేసి పంటపండిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణాలను దూరంగా తరలించాల్సింది పోయి హైదరాబాద్‌లో అయితే ఏకంగా మళ్లీ కల్లు దుకాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. దీనిని సర్కార్ కూడా గొప్ప విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మద్యాన్ని ప్రజలకు దూరం చేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాల్సిన పాలకులు ప్రజలను తాగుబోతులుగా మార్చి వచ్చే డబ్బుతో కిలో రూపాయి బియ్యం లాంటి దుబారా పథకాలకు ఖర్చు చేయడం సిగ్గుచేటు. మద్యపానం అనేది సప్త వ్యసనాల్లో ఒకటి. దాన్నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మద్యం వలన కలిగే అనర్ధాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి. మద్యాన్ని నియంత్రించాలి తప్ప గేట్లు బార్లా తీయడం వల్ల ఆదాయం సమకూరుతున్నా, అనారోగ్య సమాజాం నిర్మితమవుతోంది. ప్రభుత్వం లిక్కర్‌ను ఆదాయ వనరుగా చూసినంతకాలం దాని దుష్ఫరిణామాలకు సమాజం బలికావాల్సిందే. మరోవైపు మన్యంలో నాటుసారా ఏరులై పారుతోంది. నాటు సారాకు గిరిజనులు బానిసై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకుంటున్నారు. చివరకు అనారోగ్యంతో కాలం వెల్లదీ స్తున్నారు. బహిరంగంగానే సారా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో సారా వ్యాపారులు అమ్మకాలను రోజురోజుకూ పెంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. డబ్బులకే కాకుండా వస్తువులను తాకట్టు పెట్టుకునికూడా సారా విక్రయిస్తూ గిరిజనులను దోచుకుంటున్నారు. మన్యంలో నాటుసారా విక్రయాలు అడ్డు, ఆపులేకుండా సాగుతున్నాయి. దశాబ్దాలుగా గిరిజనేత రులు తమ ఆదాయం కోసం నాటుసారా విక్రయాలు జరుపుతున్నారు. దట్టంగా ఉండే ఆటవీప్రాంతాలు సారా తయారీకేంద్రాలుగా మార్చుకుని వ్యాపారాలు కొనసాగి స్తున్నట్టు సమాచారం. వీటన్నింటికీ కొందరు డబ్బున్న వారు ముందుండి సారాను సరఫరా చేస్తున్నారని సమాచారం. పలుమార్లు సారా కేసుల్లో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. గిరిజన గ్రామాల్లో సారావిక్రయాలు కూడా ఇక్కడ అతి సాధారణంగా జరుగు తున్నాయి. కొన్ని ఇళ్లల్లోనే వీటిని విక్రయిస్తున్నారు. ప్రధానంగా కొన్నిచోట్ల నల్లబెల్లంతోనూ గుడంబాను తయారు చేఇ విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వారపు సంతల్లో కూరగాయలు, నిత్యావసరాలు, ఇతర సరుకులతో పాటుగా సారాను కూడా వీధుల్లో పెట్టి అమ్ముతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవు. ఎపిలోని మన్యం గ్రామాల్లో వారపు సంతల్లోనే సారా విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. సారా కాసేందుకు కావాల్సిన నల్లబెల్లం, అమ్మోనియం వంటివి ముందుగానే మన్యానికి చేరిపోతున్నాయి. అత్యంత గోప్యంగా వ్యాపారులు వీటిని తరలిస్తున్నారు. పోలీసులకు ఎంతోకొంత ముట్టజెప్పడంతో వారు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వ్యాపారులు గ్రామంలో కొంతమంది గిరిజనులను మచ్చిక చేసుకుని వారి ఇళ్లలో ఈ ముడి సరుకులను పెడుతున్నారు. దీనికిగాను ప్రతిఫలంగా నిత్యావసర సరుకులు, కొంత సారాను గిరిజనులకు ముట్టజెబుతున్నట్టు సమాచారం. దీంతో నాటు సారాకు గిరిజనులు బానిసలవుతున్నారు. సారారక్కిసి బారిన పడిన ఎంతో మంది గిరిజనులు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొంత మంది తనువు చాలిస్తున్నారు. సారా తాగిన వారిలో ఎక్కువ మందిలో కాళ్లవాపు, జీర్ణశ్వాస సంబంధింత వ్యాధులు, కంటి, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సారా తాగితే తప్ప తన పని తాను చేసుకోలేని పరిస్థితికి కొంత మంది గిరిజనులు చేరుకున్నారు. అంతగా వ్యాపారులు వారిని సారాకు బానిస చేసేశారు. సారా కోసం ఇంట్లో భార్య, బిడ్డలను కొట్టి మంగళసూత్రాలు, ఇంట్లో బిందెలు, చీరలు వంటి తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు. నాటుసారాఏరులై పారుతున్నా నివారణా చర్యలు అంతంత మాత్రంగానే కనిపి స్తున్నాయి. ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో సారా నిర్మూలన కు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని పలువురు విమర్శిస్తున్నారు. మద్యం ఆదాయమే సర్కార్‌కు జీవనాధారంగా మారింది. పట్టణాల్లో లిక్కర్ షాపులకు గిరాకీ తగ్గడం లేదు. ప్రభుత్వాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. బెల్టు షాపులు, పర్మిట్ రూంలు లేకపోతే మద్యం దుకాణాలు తీసుకోడానికి వ్యాపారులు సిద్ధంగా లేరు. వైన్ షాపుల్లో మద్యం సేవించరాదని చట్టం చెబుతున్నా అనధికారిక పర్మిట్ రూంలకు కొదవ లేకుండా పోతోంది. మద్యం ఆదాయంపై ఆధారపడుతున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా జనావాసాల్లో తిష్టవేసిన మద్యం,కల్లు దుకాణాలను తరలించాలి. ఆంధ్రా, తెలంగాణ అన్న తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఊరి బయట నుంచి జనవాసాలకు తరలుతున్న మద్యం దుకాణాలు, బార్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆందోళనలు ఇటీవల చేపట్టినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు.