మద్యం స్కాం నివేదికపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి):
మద్యం సిండికేట్ల కుంభకోణంపై ఏసీబీ సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఐదు వారాలపాటు వాయిదా వేసింది. మద్యం సిండికేట్లపై గత ఏడాది చివరిలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ నెలలో దర్యాప్తు పూర్తనట్టు హైకోర్టుకు సోమవారంనాడు తెలిపింది. తమ తుది దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టు ధర్మాసనానికి సమర్పించింది. తాత్కాలిక చీఫ్ జస్టిస్. పీసీ.ఘోష్, జస్టిస్. పుర్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ నివేదికను పరిశీలించి మంగళవారంనాడు విచారణ జరిపింది.ఈ నివేదికపై ఎప్పట్లోగా చర్యలు తీసుకుంటారని అడ్వకేట్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. నాలుగువారాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన కోర్టుకు తెలిపారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఐదువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీబీనివేదికపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నందన సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నాక ఆ విషయాన్ని పరిశీలిద్దామని కోర్టు తెలిపింది.