మధిరలో జోరుగా టిఆర్‌ఎస్‌ జోరు

కమల్‌కు మద్దతుగా ఎంపి ప్రచారం

ఖమ్మం,నవంబర్‌24(జ‌నంసాక్షి): మధిరలో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌ రోడ్డు షోలు, గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. చింతకాని మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి.. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని, ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలనూ తామే గెలుస్తామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. గడిచిన 51 నెలల్లో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనటువంటి, కనీసం ఊహించనటువంటి సుమారు 411 సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేసి చూపిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వాడకు వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తున్న తీరును చూసి ఓటమి భయంతోనే భట్టీ విక్రమార్క తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో మహాకూటమి ఘోర పరాజయం పాలవుతుందని ఇప్పటికే గ్రహించిన కూటమి నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చి కఖచ్చితమైన దిశానిర్దేశరలో జిల్లాలోని ముఖ్య నాయకులమంతా కలిసి పనిచేస్తూ పదికి పది సీట్లూ గెలవబోతున్నామని స్పష్టం చేశారు. మధిరలో భట్టీ కోటలకు బీటలు వారుతున్నాయన్న భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ చేశారు.ప్రస్తుతం జిల్లాలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, మిగతా అభ్యర్థులను కలుపుకుంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నానని అన్నారు. తాము గెలుపొందే పది సీట్లలో భట్టీ స్థానం కూడా ఉందన్నారు. ఓడిపోతున్నానే అక్కసుతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.