మధుమేహ వ్యాధికి యోగానే మందు
– ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ,జూన్ 21(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్వితీయంగా కన్నల పండువగా జరిగింది. దేశంలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యతంత శ్రద్దగా యోగా నిర్వహించారు. ఊరూవాడా అంతా ఒక్కటై యోగాసనాలు వేశారు. భారతీయ ప్రాచీన కళ యోగా దేశ, విదేశాల్లో ఘనంగా జరుగుతుంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వంద దేశాల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో యోగాసాన నిర్వహణ ఘనంగా జరిగింది. ఈ యోగా కార్యక్రమంలో దీరజ్ సారస్వత్ రచించిన యోగా గీత్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాని మోడీ సహా మంత్రులు, ముఖ్యమంత్రులు యోగాసనాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ యోగాలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రపతి భవన్ సిబ్బంది, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు యోగా మానసిక, శారీరక శక్తిని అందిస్తుందన్నారు. యోగా చేయడం వల్ల శారీరం, మెదడు మధ్య సమన్వయం ఏర్పడుతుందని, దాని వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతందని ప్రణబ్ అన్నారు. చండీగఢ్‌లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానం.. ముక్తి మార్గం వంటింది. భారత్ విజ్ఞప్తి మేరకు ఐరాస జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోంది. వ్యక్తిగత, మానసిక, సామాజిక ఆరోగ్యానికి యోగాకు అధిక ప్రాధాన్యత ఉంది. యోగా సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వృద్ధి చెందుతాయి. మానసిక ఏకాగ్రత యోగా వల్లే సాధ్యమవుతుందని వివరించారు. యోగా సాధన కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఆస్తికులు, నాస్తికులు అందరికీ యోగా అవసరమన్నారు. యోగాకు పేద, ధనిక తారతమ్యం లేదు. పేదవాడైనా, జమిందారైనా యోగా సాధన చేయవచ్చన్నారు. రోగనివారణ ప్రత్యామ్నాయాల్లో యోగాకు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యోగా శిక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ఓ విధానాన్ని డబ్ల్యూహెచ్‌ఓ రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు. ఈ ఏడాది నుంచి యోగాను ప్రోత్సహించేందుకు 2 పురస్కారాలు ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ఏడాది మధుమేహ నివారణపై ప్రధానంగా దృష్టిపెట్టామని, మధుమేహ వ్యాధి నివారణలో యోగా ఔషధంలా పనిచేస్తుందన్నారు. అనేక అంతర్జాతీయ దినోత్సవాలున్నా యోగాకు ఉన్న ప్రాముఖ్యత గొప్పదని, ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా జరుపుకొంటున్న పండుగ యోగా అని తెలిపారు. యోగా ప్రాధాన్యత వల్ల శిక్షకుల అవసరం పెరిగిందని వివరించారు. యోగా దినోత్సవంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు దాదాపు 30వేల మంది పాల్గొన్నారు. ఛండీగఢ్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ప్రధాని పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, హరియాణా, పంజాబ్ ముఖ్య నేతలతో పాటు 30 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.
యోగాకు కులమతాలు లేవన్న వెంకయ్య
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… యోగా మన జీవన విధానంలో ఓ భాగమని, దీనికి కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ప్రోత్సహించాలని కోరారు. యోగా ద్వారా భారతీయల్లో ఐకమత్యం పెరుగుతుందన్నారు.
ఆయరణ దీక్షచేస్తున్న ఎంపి కూడా
ఆమరణ దీక్ష చేస్తూనే బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ యోగా చేశారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ ఎంపీ దీక్ష చేస్తున్న స్టేజ్ విూదే యోగాసనాలు వేశారు. దీక్షకు సంఘీభావం తెలుపుతూ స్టేజ్ విూద కూర్చున్న ఇతర సభ్యులు కూడా ప్రాణాయామం చేశారు. ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ నివాసం ముందే ఎంపీ మహేశ్ ఈ స్టంట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మర్డర్ కేసులో ఎంపీ మహేశ్ పాత్ర ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజీవ్రాల్ ఆరోపించారు. అసత్య ఆరోపణలు చేసిన కేజీవ్రాల్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని ఎంపీ మహేశ్ సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మరో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా మద్దతు పలికారు.