మధ్యదరా సముద్రంలో 111 చేరిన మృతుల సంఖ్య
– వలసవాదుల ఉసురు తీసిన తుపాన్
హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి):
మధ్యదరా సముద్ర తీరంలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 111కు పెరిగింది. ఐరోపా దేశాలకు తరలిపోతున్న వలసదారుల పడవ లిబియా సముద్ర తీరానికి 1770 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఈ విషయమై లిబియా సహాయక బృందాల అధికారులు మాట్లాడారు. శుక్రవారం 30మంది చనిపోయినట్లు సమాచారం అందిందని దీంతో మృతుల సంఖ్య ఈ రోజుకి 111కి చేరిందని తెలిపారు. ఇదిలా ఉండగా మునిగిపోయిన పడవ నుంచి 1400 మందిని కాపాడామని ఇటలీ రక్షక దళాలు శుక్రవారం ప్రకటించాయి.
శరణార్థులపై తుఫాను శరాఘాతం
ఇది ఇలా ఉండగా మరో వార్తా సంస్థ ఇలా తెలిపింది. ఇటలీ వెళ్లే ఆఫ్రికన్ వలసదారులతో కిక్కిరిసిన ఒక పడవ లిబియా తీరంలో గురువారం నాడు మునిగిపోయిన ఘటనలో దాదాపు 200మందికి పైగా మరణించి వుంటారని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లిబియా పశ్చిమతీరంలోని జువారా పట్టణం నుండి దాదాపు 400 మందితో బుధవారం సాయంత్రం బయల్దేరిన ఈ పడవ తుపానులో చిక్కుకుపోయిందనీ, రాత్రి సమయానికి లిబియా కోస్ట్‌గార్డ్ సిబ్బంది దాదాపు 201 మందిని రక్షించగలిగారని, అందులో 147 మందిని సబ్రతాలోని అక్రమ వలసదారుల శిబిరానికి తరలించారని అధికారులు వివరించారు.వీరంతా ఆఫ్రికా, పాకిస్తాన్, సిరియా, బంగ్లాదేశ్‌కు చెందినవారని ఓ అధికారి తెలిపారు.