మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

au4c35duమధ్యప్రదేశ్‌లోని కుదువా రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మొదట ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ప్రెస్ అర్థరాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల మధ్యలో పట్టాలు తప్పిందని సమాచారం. ఈ ప్రమాదంలో కామయాని ఎక్స్‌ప్రెస్‌ బోగీలు మచాక్ నదిలోకి పడిపోయినట్టు భావిస్తున్నారు. ఆ తర్వాత అటువైపు వెళ్తున్న మరో రైలు జనతా ఎక్స్‌ప్రెస్‌ కూడా ప్రమాదానికి గురైంది. ఈ రెండు సంఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు, ప్రమాద స్థలానికి రైల్వే ఎమర్జెన్సీ బృందాలను పంపింది. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్లమని ఆదేశించారు. దీంతో, ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, మాచక్‌ నది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు రైళ్లు బోగీలు 48 వరకు నదిలో పడిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు ఎంతమందో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని, రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందలేదని, కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండో రైలు అదే ప్రాంతంలోకి రావటంతో ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. దీంతో, విపత్తు నుంచి మరో రైలును ఆపటం సాధ్యం కాలేదంటున్నారు. ఇంకోవైపు, సంఘటన జరిగినప్పుడు తోటి ప్రయాణీకులు 50-60 మందిని కాపాడారని వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు, మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.