ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్
వరద ధాటికి విరిగిన గేటు
నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
విజయవాడ,ఆగస్ట్5( జనంసాక్షి):కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వరద ముంపు ప్రభావిత ప్రాంత వాసులకు సూచిస్తున్నారు. వరద ఉధృతికి పులిచింతల ప్రాజెక్టులోని ప్రమాదవశాత్తు 16వ నంబరు క్రస్ట్ గేట్ గేటు విరిగిపోయింది. 2 లక్షల క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో వెంటనే అధికారులు 16వ గేటు సహా 11,13,14,18,19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతల ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 44.53 టీఎంసీలుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 174.14 అడుగులు ఉంది. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు డ్యాం లో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేకుంటే ఆ నీటి వత్తిడి ఇతర గేట్ల పై పడే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నది. దీంతో..అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. వాగులు,వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
పులిచింతల బ్యారెజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డి
పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తి విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘’రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెయిన్ గడ్డర్ విరిగిపోవడంతో.. సపోర్ట్ రోప్ థ్రెడ్‌లు తెగిపోయి గేటు నదిలో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది’’ అని తెలిపారు. ‘’పైనుంచి వరద నీటిని కిందికి వదిలెందుకు రాత్రి గేట్లను ఎత్తారు. ఒకే గేటు గుండా నీరు వెళ్తుండడంతో ఒత్తిడిని తగ్గించేందుకు క్రమక్రమంగా మొత్తం గేట్లను ఎత్తడం జరిగింది. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్ చేస్తున్నాం. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది’’ అన్నారు.