మధ్యాహ్నభోజనం నాణ్యత పెరగాలి
అనంతపురం,జూన్22(జనం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన బడిబాట మాటెలా ఉన్నా మధ్యాహ్నభోజన పథకం బలోపేతం కావాలని తల్లిదండ్రలుఉ కోరుకుంటున్నారు. స్కూళ్లు తెరిచినందున దీనిని మరింత పటిస్టంగా అమలు చేస్తే పిల్లలకు భరోసా ఉంటుందని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల వల్ల విద్యార్థులకు నీళ్ల చారు,ఉడకని అన్నం పెట్టి ఏజెన్సీ నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఈ భోజనం తినలేక ఇళ్లకు వెళ్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచయినా మంచి భోజనం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో పుష్టికరమైన ఆహరం లేక విద్యార్థులు రక్తహీనతపెరిగిపోయి అనారోగ్యం బారిన పడుతున్నారని తేలింది. వారానికి రెండు రోజులు గుడ్లు ఇవ్వాలని నిబంధన ఉండేది. గుడ్డు ధరలు పెరగడంతో భోజనం పథక నిర్వాహకులు చేతులెత్తేసి, ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలని డిమాండు చేశారు.అయితే అధికారులు ఆ రేటుకు గుడ్డును సరఫరా చేయలేక వారానికి ఒకసారి గుడ్డు, అరటి పండు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మెనూను నిర్ణయించి ఆ ప్రకారంగా ఏ జెన్సీలు విద్యార్థులకు ఆహారం వడ్డించాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్త మెనూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరిగేలా, పటిష్టమైన భోజనం అందించేలా చూడాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. మెనూ ప్రకారం అమలైతే గతం కంటే కొంచెం నాణ్యమైన భోజనం పెట్టేందుకు అవకాశం ఉంది.