మధ్యాహ్న భోజన బియ్యంలో ఎలుకల మలవిసర్జనలు
బియ్యంలో మొత్తం రాళ్లు, రప్పలు, లక్కపురుగులే
వీటిని తీయడానికి ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వంట సిబ్బంది
పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
నంగునూరు,సెప్టెంబర్23(జనంసాక్ షి):
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యంలో ఎలుకల మలవిసర్జనలు, రాళ్లు, పురుగులు, ఉండడం పట్ల మండలం వ్యాప్తంగా తీవ్ర కలకలం లేపుతోంది. నాణ్యతలేని, కలుషితం బియ్యాన్ని ప్రభుత్వ బడుల్లో పిల్లలకు వండి పెట్టడం ద్వారా ఫుడ్ పాయిజన్ తో పిల్లలు తీవ్ర అస్వస్థకు లోనై ఎంతోమంది చనిపోయిన ఉదాంతాలను రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో చూశాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కొంచమైనా చలనం లేకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఎంతో పేరు గడించిన మంత్రి తన్నీరు హరీష్ రావు సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కలుషిత భోజనాన్ని పిల్లలకు పెట్టవద్దని మండల అధికారులకు ఎంతగా చెప్పినా వినడం లేదని గ్రామ ప్రజలు, పిల్లలు వాపోతున్నారు. విద్యార్థులకు చక్కటి సన్న బియ్యంతో భోజనం వండి పెడుతూ పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప చేతిల్లో లేదని, లోపల అంతా డొల్లతమేనని ప్రజలు, విపక్షాలు, ఆరోపిస్తున్నాయి. మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంతవరకు యూనిఫామ్స్ రాలేదు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు గత 12 నెలల నుంచి జీతాలు సరిగ్గా రావడం లేదంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
*మధ్యాహ్న భోజన నిర్వాహకులు*
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సన్న బియ్యంలో లక్క పురుగులు, ఇసుకరాళ్ళు ఉంటున్నా మాట నిజమే. ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా… ఫలితం లేకుండా పోయింది. ఎంత చెప్పినా మా మాటలను వారు వినడంలేదు. గత 12 నెలలు నుంచి మాకు ఇంతవరకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఈ విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి మాకు అందలేదు. ప్రభుత్వమేమో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని చెబుతుందే కానీ మాకు రావాల్సిన జీతాలు చెల్లించాడానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ విద్యా సంవత్సరంలో అప్పులే మిగిలేలా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సహాయ సహాకారాలు సరిగ్గా లేకపోయినా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా బయట అప్పులు తెచ్చి మరీ పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మేను ప్రకారం తాజా కూరగాయలతో భోజనం అందిస్తున్నాము.
నంగునూరు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గండ్ల రమేష్ మాట్లాడుతూ..
ప్రైమరీ పాఠశాలలో నెలకొన్న ఈ పరిస్థితులకు మండలాధికారులు వెంటనే చక్కదిద్దక్కపోతే పిల్లల తల్లిదండ్రులతో కలిసి మండల పరిషత్, జిల్లా పరిషత్ తో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గాండ్ల రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకటేష్, అనిల్, మహేందర్, సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.