మన ఊరు -మన ప్రణాళిక ఏమైంది ?

5
– గ్రామజ్యోతి ఏంది?

– పొన్నం ప్రెస్‌మీట్‌

కరీంనగర్‌,,జులై31(జనంసాక్షి):

తెలంగాణాలో సెంటిమెంట్‌తో ఆయింట్‌మెంట్‌ పూసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆచరణలో మాత్రం ప్రజలను అనేక రూపాల్లో మభ్య పెడుతూ తన పాలనను గాడి తప్పిస్తున్నాడని కరీంనగర్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటికినిన్న మన ఊరు మన ప్రణాళిక పేరుతో గ్రామ గ్రామానికి అధికారులను ప్రజాప్రతినిధులను గల్లీ గల్లీ తింపి తయారు చేసిన కాగితాలు కళ్లముందే ఉన్నప్పటికి మళ్లీ గ్రామజ్యోతి పేరుతో గ్రామాల ప్రణాళికలు తయారు చేస్తామనడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. నాటి ప్రణాళికలకు నేడు తయారు చేస్తున్న గ్రామజ్యోతి పేరుతో మరోసారి రాద్దాంతం చేస్తోందని, దీనికి తేడా ఏంటో కేసీఆర్‌ వెల్లడించాలన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఏం చేయాలో ప్రజల అవసరాలేంటో కూడా గుర్తించక ఇప్పటికి సర్వేల పేరుతో అధికారుల సమయం వృధా చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఏదో కార్యక్రమం పేరుతో ఉద్యోగులను సర్వేలు చేయిస్తే నిజంగా చేయాల్సిన పనులను ఎప్పుడు ఎలా చేస్తారో ఆయనకే తెలియాలన్నారు. ప్రధానంగా మన ఊరు మనప్రణాళికకు, నేటి గ్రామజ్యోతి కార్యక్రమానికి తేడాను వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ యే శాఖలో ఏమేం పనులు చేశారు, ఎన్నికోట్లను వెచ్చించారనే విషయంపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు వర్షాలు లేక విలవిల్లాడుతుంటే వారిని కనీసం పలుకరించిన పాపాన పోవడంలేదని, కరువు మండలాల ప్రకటన చేసే ధైర్యం కూడా చేయడంలేదన్నారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రపంచంలో తన కిరీటం ఎక్కడ ఊడిపడిపోతుందోననే భయంతో కేసీఆర్‌ ఉన్నాడన్నారు. ఇప్పటివరకు తెలంగాణాలోని పది జిల్లాల్లో ఒక్క రైతుకైనా రుణాలను పంపిణీచేశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నా కూడా పాలకులకు

చీమకుట్టినట్లుగా కూడాలేదని ఆయన ఆరోపించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో చెప్పాలని ప్రభాకర్‌ ప్రశ్నించారు.