మమత పై దాడికి నిరసనగా యశ్వంత్ సిన్హా రాజీనామా
తృణముల్ లో చేరిక
భాజపా తీరుపై మండిపడ్డారు
కోల్కతా,మార్చి13 (ఆర్ఎన్ఎ): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు
వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. టిఎంసి నుంచి నేతలు బిజెపిలోకి వలస కడుతుంటే యశ్వంత్ మాత్రం తృణమూల్ల్ఓ చేరడం విశేషం. ఉదయం కోల్కతాలోని టీఎంసీ భవన్లో ఆ పార్టీ నేతల సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకున్నారు. మమతపై జరిగిన దాడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితిని దేశం ఇప్పుడు ఎదుర్కొం టోంది. వ్యవస్థల బలంపైనే ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. కానీ నేడు దేశంలో న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. వాజ్పేయీ హయంలోని భాజపా ప్రభుత్వం ఏకాభిప్రాయ విధానాలను విశ్వసించేది. కానీ నేటి ప్రభుత్వం ‘అణచివేత-విజేత’ ధోరణిని నమ్ముతోంది. అందుకే అకాళీదళ్, బిజు జనతాదళ్ వంటి పార్టీలు ఎన్డీయేను వీడాయని అంటూ భాజపాపై విమర్శలు గుప్పించారు. 83ఏళ్ల యశ్వంత్ సిన్హా గతంలో సుదీర్ఘకాలం జనతాదళ్, భాజపాలో పనిచేశారు. భాజపా హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రిగానూ వ్యవహరించారు. అయితే సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సిన్హా.. 2018లో భాజపాను వీడారు. ఆ తర్వాత కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న ఆయన.. బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది నెలలుగా బెంగాల్లో అనేక మంది తృణమూల్ నేతలు కాషాయ కండువా కప్పుకుంటున్న తరుణంలో టీఎంసీలోకి సిన్హా రాక ఆ పార్టీకి కలిసొచ్చే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.