మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

 

-రోహింగ్యా తెగ ఊచకోతపై నోరు విప్పుతాడా

రంగూన్‌: రెండోసారి అధ్యక్షపీఠాన్ని చేజిక్కించుకున్న ఒబామా నూతన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నడు. చారిత్రక ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి ఒబామా మయన్మార్‌లో పర్యటించనున్నాడు. దీంతో మయన్మార్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రికార్డు సృష్టించాడు. అయితే మయన్మార్‌లో జరుగుతన్న రోహింగ్యా తెగల ఊచకోతపై ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా అక్కడ వాలిపోయి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రపంచ పోలీస్‌ అమెరికా ముస్లీంలపై జరుగుతున్న దాడులను గురించి స్పందించకపోవడం ఆగ్రహం తెప్పిస్తోంది. మయన్మార్‌లో ముస్లీం తెగ అయిన రోహింగ్యా తెగల వారిపై అక్కడి నియంతృత్వ పాలకులు సాగిస్తున్న మారణహోమంపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. మానవహక్కుల ఉల్లంఘనలపై స్పందించే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ సైతం ఈ ఊచకోతలపై తీవ్రంగా స్పందించింది. మయన్మార్‌లో పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ తేల్చింది. ప్రసిద్ధ మీడియా సంస్థ అయిన బిబిసి సైతం అక్కడి మారణకాండను ప్రపంచం దృష్టికి తెచ్చింది. అయితే రోహింగ్యా తెగ ముస్లీంలకు అంతర్జాతీయ సహాయం అందకుండా అడ్డుకొంటున్న మయన్మార్‌ సైనిక పాలకులు ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు. అయితే ఇంత జరుగుతన్నా ప్రపంచ పెద్ద పోలీస్‌ అమెరికా స్పందించలేదు. మొదట్నించీ ముస్లీంలను అవమానించే అమెరికా దీనిపై స్పందించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేకున్నా, మానవహక్కుల గురించి ఉపన్యాసాలు దంచే ఆదేశ పాలకులు దీనిపై స్పందించకపోవడం బాధాకరం. మయన్మార్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇప్పటికైనా దీనిపై స్పందిస్తాడో లేదోనని ఉత్కంఠతో వేచిచూస్తున్నారు.