మయన్మార్ ఘర్షణలో 19మంది మృతి
యాంగాన్,మే12(జనం సాక్షి ): మయాన్మార్ సైనిక దళాలకు, ట్యాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (టిఎన్‌ఎల్‌ఎ) సాయుధ బృందాలకు మధ్య ఉత్తర షాన్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘర్షణల్లో 19 మంది మృతి చెందారు. సుమారు 24 మంది గాయపడ్డారు. మయన్మార్ ఆర్మీ ఈ ఘర్షణల గురించి వెల్లడించింది. భిన్నజాతులకు, మయన్మార్ సైన్యానికి మధ్య చిరకాలంగా ఉన్న ఈ ఘర్షణలు జనవరి నుండి మరింతగా పెరిగాయి. తాజా ఘర్షణల్లో ఇరు వైపులా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి స్థానిక ఎన్‌జిఒ నాయకులు థాంగ్ తున్ సహాయమందించారు. ఈ ఘర్షణల వల్ల మంటల్లో కాలిపోతున్న వాహనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మయన్మార్‌లో దీర్ఘకాలికంగా ఈ ఘర్షణలు నివారించడం తమ ప్రాధాన్య అంశంగా 2016లో అధికారంలో వచ్చిన అంగ్‌సాన్ సూకీ పేర్కొన్న విషయం తెలిసిందే. మయన్మార్‌కు ఉత్తరాన స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపుల్లో టిఎన్‌ఎల్‌ఎ ఒకటిగా ఉంది.