మయ్మమ్‌ విజిల్‌తో ప్రజల సమస్యలపై నజర్‌-

యాప్‌ను ప్రారంభించిన కమల్‌ హాసన్‌
జిల్లాల పర్యటనలతో పార్టీకి ఊపు
చెన్నై,మే1(జ‌నం సాక్షి): ఇటీవలే రాజకీయరంగ ప్రవేశం చేసిన  ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అధినేత కమల్‌ హాసన్‌ మంగళవారం ‘మయ్మమ్‌ విజిల్‌’ అనే పేరుతో పార్టీకి చెందిన యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దీంతో ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించారు. ఈసందర్భంగా కమల్‌  మాట్లాడుతూ ఈ యాప్‌ పార్టీ నేతలకు అలారమ్‌లాంటిదని, సామాన్య ప్రజల సమస్యలను తెలసుకోవడానికి మా పార్టీ నేతలు పాత్రికేయుల్లాగా పనిచేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నమోదు చేసిన నేతలకు, వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం కాని, వెంటనే పరిష్కారం చూపలేమని, ఎందుకంటే ఈ యాప్‌ మంత్రదండం కాదని  అన్నారు. అధికారులు,నేతలపై పర్యవేక్షణకు ఈ యాప్‌ ఉపపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు, సమాజంలో నెలకొన్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా విజిల్‌ అనే మొబైల్‌ యాప్‌ను కమల్‌ రూపొందించారు. ఈ యాప్‌కు ఫిర్యాదులు పంపేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హావిూ ఇచ్చారు. తమిళనాడును అవినీతి రహితంగా మార్చడమే తన రాజకీయ అజెండా అంటూ ఫిబ్రవరిలో ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే కమల్‌  తాను స్థాపించిన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఏడు జిల్లాల్లో ఆరు రోజులపాటు పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీని నెలకొల్పిన నాటి నుంచి ప్రజలను కలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్న కమల్‌ రామనాథపురం, మదురై జిల్లాల్లో తన తొలి, మలి విడత పర్యటనలను పూర్తిచేశారు. ఆ తరువాత ఈరోడ్‌ జిల్లాలో పర్యటనలో ప్రజలు పెద్ద ఎత్తున కమల్‌కు స్వాగతం పలికారు. దీంతో మరింత ఉత్సాహంతో అన్ని జిల్లాల్లో పర్యటించాలని కమల్‌ తీర్మానించుకున్నారు. మే, జూన్‌ మాసాల్లో ఏడు జిల్లాల్లో పర్యటనకు ఆయన సిద్ధం అయ్యారు. మే 16వ తేదీన కన్యాకుమారి జిల్లా, 17న తూత్తుకూడి, 18న తిరునెల్వేలి, విరుదునగర్‌లలో పర్యటిస్తున్నారు. జూన్‌ 8వ తేదీన తిరుప్పూరు జిల్లా, 9న నీలగిరి, 10న కోయంబత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన సమయంలో ముఖ్య కూడళ్లలో ప్రజలను
ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏడు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.