” మరణశయ్యపై సర్కారు సదువు… ఈ పాపం కేసిఆర్ కే దక్కుతుంది – బిజెపి నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ అప్రతిష్టకు లోనవుతుందని, నేడు సర్కారు సదువు మరణశయ్యపై వేలాడుతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధి గోకుల్ ఫ్లాట్స్, తారా నగర్, ఇందిరానగర్, వేముకుంట, వికాస్ సెక్షన్ కాలనీ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను స్థానిక నాయకులు, కాలనీల ప్రతినిధులతో కలిసి బుధవారం యోగానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలతోపాటు, స్థానికంగా ప్రజలు పోరాడుతున్న సమస్యలను సైతం యోగానందుకు ఏకరుపెట్టారు. ఈ సందర్భంగా గజ్జల మాట్లాడుతూ ప్రభుత్వ బడి, సర్కారు విద్య తెలంగాణ రాష్ట్రంలో చరమాంకానికి చేరుకుందని, వైన్స్ లు, బార్లు, భూముల దోపిడీల మీద ఉన్న శ్రద్ధలో 10 శాతం కూడా ప్రభుత్వ విద్యపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టింపు లేదని గజ్జల ఎద్దేవా చేశారు. గులాబిపాలనలో ఉచిత విద్యావిధానం దారి తప్పుతూ ప్రైవేటు పరం అవుతుందని, ఇందుకు దగ్గరుండి కెసిఆర్ సర్కారు కార్యం చక్కదిద్దడం సిగ్గుచేటు అన్నారు. ఏ ప్రాంతమైన సమగ్రమైన అభివృద్ధిని సాధించాలంటే అక్కడ కంపల్సరీ విద్యావంతులపాత్ర అనివార్యమని, అందుకే ప్రతి పేద విద్యార్థి చదువుకునేలా సర్కారు చదువును బతికించుకోవాల్సిన అవసరం ప్రతి తెలంగాణబిడ్డపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా వసతులకొరత, ఉపాధ్యాయుల కొరత, భవనాల కొరత కనిపిస్తుందేతప్ప ఎక్కడ పూర్తిస్థాయి మౌలిక వసతులు ఉన్న పాఠశాల మచ్చుకైనా లేదని గజ్జల దుయ్యబట్టారు. పాలకులు, అధికారులనుండి సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్ల ప్రభుత్వవిద్యకు తెలంగాణ రాష్ట్రంలో సముచిత స్థానం లభించడంలేదని, ఇది భవిష్యత్ తరాలకు షరాఘాతమై తగులుతుందని ఆయన హెచ్చరించారు. తుగ్లక్ ను మించిన పాలన పుణ్యమాని ప్రభుత్వ విద్యకు చెదలుపట్టినంత పనైందని, ఇలాగే ఇంకొంత కాలం కొనసాగితే తెలంగాణలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే అవకాశం ఉందని గజ్జల ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, జయలక్ష్మి, శివ కుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, శోభ దూబే, G. శ్రీనివాస్ రెడ్డి, రాజు శెట్టి, రజిని, అనంత రెడ్డి, చందర్రావు, గౌస్, కృష్ణమోహన్, గా బాలరాజు, జగతి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.