మరోచరిత్ర దిశగా.. సైనానెహ్వాల్‌!పలు తప్పిదాల వల్లే..ఓడిన కశ్యప్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : స్వర్ణం.. లేదా కాంస్యం వైపు అడుగులేస్తున్న సైనా నెహ్వాల్‌.. ఆమె పోరాట పటిమ అందర్నీ అలరిస్తోంది.. ఏదేమైనా హైదరాబాదీ బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ నూతన చరిత్ర సృష్టించారు. మరికొన్ని గంటల్లో.. స్వర్ణమో.. రజతమో సాధించి మరోచరిత్ర రాయబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనున్న సెమీస్‌లో ఆ విషయం సుస్పష్టమవ్వనున్నది. ఆమె గెలిస్తే.. స్వర్ణం ఖాయం. ఒకవేళ ఓడితే కాంస్య పతకం పోరులో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక్క అడుగు.. ఆమె భవితవ్యాన్ని..మలుపు తిప్పనున్నది. ఏదేమైనా ఫలితం కోసం శుక్రవారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.
ఏదేమైనా సైనా నెహ్వాల్‌ మొత్తానికి నూతన చరిత్ర సృష్టించారు. 120 కోట్ల మంది ఆశలను మోస్తోంది. పతకం తెస్తుందన్న భారతీయుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన ఆట తీరును ఒకసారి మననం చేసుకుందాం.. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌, నాలుగో సీడ్‌ సైనా 21-15, 22-20తో వరల్డ్‌ ఏడో ర్యాంకర్‌, ఏడో సీడ్‌ టిన్‌ బాన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించారు. నాలుగేళ్ల కిందట బీజింగ్‌ గేమ్స్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సైనా ఈసారి మాత్రం ఆ అడ్డంకిని సునాయాసంగానే దాటేసింది. మొత్తం 39 నిమిషాల పాటు మ్యాచ్‌ జరిగింది. డెన్మార్క్‌కు చెందిన బాన్‌ పోరాడి ఓడింది. కేవలం 16 నిమిషాల పాటే జరిగిన తొలి గేమ్‌లో తొలుత సైనా 11-7 ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత షాట్లలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ 20-12 స్కోరును సాధించింది. ఈ దశలో బాన్‌ మూడు గేమ్‌ పాయింట్లను కాపాడుకుంది. చివరకు సైనా కొట్టిన స్మాష్‌ను నెట్‌ వద్ద అందుకోలేక బాన్‌ గేమ్‌ను చేజార్చుకుంది. తొలి గేమ్‌ అలా ముగిసింది. ఇక రెండో గేమ్‌ను పరిశీలిస్తే.. ఆరంభంలో బాన్‌ 3-0 ఆధిక్యత సాధించింది. తర్వాత 10-7తో గెలిచింది. కానీ సైనా ర్యాలీలతో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 11-10తో స్కోరు సాధించింది. తర్వాత సైనా డ్రాప్‌, నెట్‌ షాట్లను ఆశ్రయించింది. స్మాష్‌లను సంధించిన బాన్‌ 15-15తో సమం చేసింది. తర్వాత బాన్‌ 20-17 ఆధిక్యంలో ఉన్నప్పుడు సైనా క్రాస్‌ కోర్టు విన్నర్‌ ద్వారా ఒక పాయింట్‌ సాధించింది. తర్వాత మరో రెండు గేమ్‌ పాయింట్లను కాపాడుకున్న సైనా 20-20తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత బాన్‌ తప్పిదాలు చేయడంతో సైనా వరుసగా రెండు పాయింట్లను సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా వరల్డ్‌ నంబర్‌వన్‌ యిహాన్‌ వాంగ్‌ (చైనా)తో సైనా తలపడనున్నారు. గతంలో ఆమెతో తలపడిన అనుభవం సైనాకు ఉంది. గత మ్యాచ్‌లలో వాంగ్‌ను ఎదుర్కోలేక పోయినప్పటికీ సెమీఫైనల్‌లో ఆమెను ఓడించాలనే ఆత్మవిశ్వాసంతో సైనా ఉంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల పాటు వేచి చూడాల్సిందే.
పలు తప్పిదాల వల్లే..
ఇదిలా ఉండగా పురుషుల బాడ్మింటన్‌లో అందరి అంచనాలకు మించి ఆడిన హైదరాబాదీ కుర్రాడు పారుపల్లి కశ్యప్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో పోరాడి ఓడాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ లీ బోంగ్‌ నీ (మలేసియా) ఆటగాడు కశ్యప్‌ గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. అయితే కశ్యప్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరికంటా పోరాడిన పటిమ అందర్నీ ఆకట్టుకుంది. అతను కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అయితే చివరిలో పలు తప్పిదాలు చేయడంతో చేజేతులా అవకాశాన్ని జారవిడుచుకున్నాడు.
కొనసాగుతున్న చైనా దూకుడు..
పతకాలను తన ఖాతాలో వేసుకునే విషయంలో చైనా ఆరంభం నుంచి ఆధిక్యత కొనసాగిస్తోంది. గురువారం వరకు 18 స్వర్ణాలు.. 11 రజతాలు.. 4 కాంస్య పతకాలతో అన్ని దేశాలకంటే ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానం అమెరికా దక్కించుకుంది. 15 స్వర్ణాలతో.. 8 రజతాలతో.. 9 కాంస్యాలతో రెండో స్థానంలో పరిగెడుతోంది. ఇదిలా ఉండగా మొత్తం 49 దేశాలు పతకాలు సాధించాయి.భారత్‌ 40వ స్థానంలో ఉంది.