మరోపేరుతో దోపిడీలకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు
పినపాక: జానంపేట గ్రామంలో నక్సలైట్ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఏడుళ్లబయ్యారం ఎస్సై కె.శ్రీను అరెస్టు చేశారు. గతంలో నక్సలైట్ల పేరుతో దోపిడికి పాల్పడిన రెండు బృందాలు జానంపేట గ్రామంలో మరో దోపిడీకి పథకం రచించేందుకు సమావేశమయ్యారనే సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారని మనుగూరు డీఎస్పీ తిరుపతి తెలిపారు. వీరిలో వరంగల్, ఖమ్మం , నల్గొండ
జిల్లాలకు చెందిన వారున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎనిమిది మందిని అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరి నుంచి రూ.లక్షనలభై వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు కప్లింగ్ బాంబులు, రెండు బొమ్మ తుపాకులు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.