మరో గుడ్డు ఎవరు మింగుతున్నారు?

4

– వారానికి రెండిస్తే ఒకటే ఎలా ఇస్తారు?

– ప్రధానోపాధ్యాయుడిపై గవర్నర్‌ ఆగ్రహం

– కిషన్‌నగర్‌లో గ్రామజ్యోతిలో పాల్గొన్న నరసింహన్‌

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) :తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కిషన్‌నగర్‌ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. కిషన్‌నగర్‌ గ్రామంలోని అన్ని విషయాలపై ఆరా తీసిన గవర్నర్‌ పథకాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకుని ప్రధానోపాధ్యాయునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి ఒక్క గుడ్డు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. గ్రామంలో ఉన్న ప్రతి కమిటీ వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా ఇవ్వని రేషన్‌ డీలర్‌పై మండిపడ్డారు. గ్రామస్థులతో రెండు గంటల పాటు గవర్నర్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జూపల్లి కృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను పత్రి ఒక్కరూ వినియోగించుకోవాలి: గవర్నర్‌

ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ కోరారు. కిషన్‌నగర్‌లో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాల్ని తగ్గించి అందరికి ఉన్నత విద్య అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. అందరూ ఐకమత్యంతో ఉండటంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. గ్రామాల్లో అన్ని పథకాలు వంద శాతం అమలు కావాలని ఆకాక్షించారు.