మరో రూ.10కోట్లు మంజూరు : దామోదర

నిజామాబాద్‌, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మెడికల్‌ సీట్ల వ్యవహారంలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం స్వయంగా ముఖ్యమంత్రే కేంద్రంతో మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ కమిటీ సమావేశానికి వెళుతూ జిల్లాలోని డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో అల్పాహారం తీసుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెడికల్‌ సీట్లు, తెలంగాణ యూనివర్సిటీకి నిధుల విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పారు. మున్నెన్నడూ లేని విధంగా తెలంగాణ యూనివర్సిటికీ నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తున్నామని ఈ సంవత్సరం 20 కోట్లకు గాను పది కోట్ల రూపాయలను తొలివిడతలోనే విడుదల చేశామని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో కేంద్రం ఆగస్టు తర్వాత నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం కేంద్రం స్పష్టమైన వైఖరి తీసుకుకుంటుందన్నారు. తెలంగాణ యూనివర్సిటి పరిధిలో నిజామాబాద్‌,ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలు ఉండగా నేడు మెదక్‌ జిల్లాను రాజధాని సరిహద్దుల్లో ఉండడం వల్ల యూనివర్సిటీ నుంచి తొలగించారని ఆదిలాబాద్‌ను తిరిగి నిజామాబాద్‌లో కలిపేందుకు ప్రభుత్వం పునరాలోచిస్తుందని దామోదర రాజనర్సింహ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. సెట్‌ పరీక్ష అనంతరం అర్హత గల అభ్యర్థులను రోస్టర్‌ ప్రకారం యూనివర్సిటీలో నియమిస్తామని చెప్పారు. ఎక్కడైనా నియామకంలో ఉల్లంఘనలు జరిగితే సంబంధిత యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎస్సీ,ఎస్టీ రుణాలను బినామీలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేయగా సబ్‌ప్లాన్‌ కమిటీ వీటిపై దృష్టిని సారించిందని దీనిపై వచ్చే నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం యూనివర్సిటీ ఆవరణలో మొక్కలను నాటారు. యూనివర్సిటీ ఉపకులపతి అక్బర్‌ అలీఖాన్‌, డిఐజి సంజయ్‌ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు