మలుపు తిరిగిన శ్రీగౌతమి మృతి కేసు

భార్యను హత్య చేయించిన టిడిపి నేత

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు క్లోజ్‌ చేసే యత్నం

పోలీసుల దర్యాప్తుతో బయటపడ్డ ఓ కిరాతక భర్త బండారం

ఏలూరు,జూన్‌26(జ‌నం సాక్షి): రోడ్డుప్రమాదంలో మృతి చెందిందని భావించిన ఓ యువతి కేసు అనూమ్యంగా మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని, అది హత్యఅని, హంతకుడు భర్తేనని పోలీసులు తేల్చారు. భర్త కూడా అధికార టిడిపికి చెందిన వ్యక్తి కావడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఏడాదిన్నర కిందట మృతిచెందిన శ్రీగౌతమి కేసు మలుపు తిరిగింది. ద్విచక్రవాహనం ప్రమాదంలో శ్రీగౌతమి మృతిచెందినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. అయితే కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆమెది హత్యగా తేల్చారు. ఈ హత్యతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితుల్ని పాలకొల్లు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో టిడిపి నాయకుడు వీరవెంకట సత్యనారాయణ, నరసాపురం జడ్పీటీసీ బాలం ప్రతాప్‌, బాలం ఆండ్రూ, రమేశ్‌ ఉన్నారు. ఇందులో వీరవెంకట సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా చేర్చారు. శ్రీగౌతమిని వీరవెంకటసత్యనారాయణ తన స్నేహితులతో కలసి పథకం ప్రకారమే హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీగౌతమిని వీరవెంకటసత్యనారాయణ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకొని తన వద్దే ఉండాలని ఆమె సత్యనారాయణను ఒత్తిడి చేయడంతో అడ్డు తొలగించుకునేందుకు పథకం వేశాడు. ఏడాదిన్నర కిందట పాలకొల్లు నుంచి ద్విచక్రవాహంలో వస్తున్న శ్రీగౌతమిని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీగౌతమి అక్కడికక్కడే మృతిచెందగా… చెల్లెలు పావని గాయాలతో బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దీన్ని ప్రమాదంగా పరిగణించి కేసును మూసివేశారు. అయితే శ్రీగౌతమిని ప్రమాదం కాదని.. హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. దీంతో కథ ముగిసిందనుకున్న టిడిపి నేతకు ఉచ్చు తప్పలేదు.

—-