మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

4

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వారి ప్రయోజనాలే ముఖ్యంగా పరిహారం చెల్లించాలని ఆదేశించారు. శనివారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కలిశారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పునరావాసంపై ఇరువురు చర్చించారు. విపక్షాల ఆందోళనలు, రైతుల దీక్షలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతులకు పరిహారం ఏ పద్ధతిలో కావాలంటే ఆ మేరకు అందిస్తామని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం లేదా జీవో 123 కింద ఎలా కోరితే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు. ఇందులో రైతులకే ఛాయిస్‌ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి సిద్దంగా ఉందని సూచించారు.  మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ భూ సవిూకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు వారి అభిప్రాయాలకు అనుగూణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించడానికి

ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని వివరించారు. 2013లో తెచ్చిన చట్టం ఒకటి కాగా… తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.123 మరొకటి. రైతులు ఏ పద్దతి ప్రకారం పరిహారం కావాలంటే ఆ లెక్క ప్రకారమే పరిహారం అందిస్తామని వెల్లడించారు. జీవో నెంబర్‌ 123 ప్రకారం కావాలన్న వారికి అదే విధానం ద్వారా, 2013 చట్ట ప్రకారం కావాలన్న వారికి అదే నిబంధన ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షాల రాద్ధాంతం కారణంగా ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. తాజా నిర్ణయంతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం తీసుకునే రైతుల భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు వివరించారు. అయితే రైతులను ఆదుకుని వారికి మెరుగైన విధానంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లివ్వాలనే ప్రభుత్వ సంకల్పానికి  కాంగ్రెస్‌, టీడీపీలు అడ్డుపడుతున్నాయన్నారు. 60 ఏండ్లుగా దోపిడీకి గురైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలకు శ్రీకారం చుడితే… కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఓర్వలేక అభివృద్ధిని అడ్డుకుంటున్నారుఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇచ్చినప్పటికీ నీటిసమస్య కారణంగా పంటలు సాగవడం లేదని గుర్తించిన ప్రభుత్వం.. ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల ఎకరాలకు నీరందించే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే రైతులే ఆ పార్టీలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.మనకు ఉపయోగపడే మల్లన్నసాగర్‌ ముంపు భూములకు ఎకరానికి రూ.ఏడు లక్షలు ఇస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.