మల్లన్నసాగర్ ముంపు తక్కువ
– ప్రతిపక్షాలదే అనవసరమైన యాగీ
– మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్,జూన్ 26(జనంసాక్షి): మల్లన్నసాగర్‌తో ఏర్పడే ముంపు తక్కువ అని, ప్రతిపక్షాలే అనవరరాద్ధాంతం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.హైదరాబాద్‌లో
ఆదివారం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టులో రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలే బాధ్యత వహించాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్షాలు 2013 యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. దీని ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే రూ.లక్షా 80 వేలు, అదే జీవో 123 ప్రకారం
అయితే రైతులకు రూ.4 లక్షల 80 వేలు అందుతుందన్నారు.రాష్ట్రంలో విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ వల్ల ఏడు గ్రామాలే ఇబ్బంది పడుతున్నాయని, కానీ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల 11 గ్రామాలు నష్టపోయాయని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని అందుకు గాను కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ముందుగా క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు.