మళ్లీ అధికారంలోకొస్తాం
` గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం
` కరెంట్ కష్టాలే ఉద్యమం రాజేశాయి
` ఆనాటి అవమానాలు, అనుభవాలే ప్రేరేపించాలి
` కరెంట్‌తో పడ్డ గోసలు అన్నీఇన్నీ కావు
` కరెంట్ కోసం ఆనాటి సీిఎంలను నిలదీశా..
` తెలంగాణ వచ్చాక కరెంట్ సమస్య లేకుండా చేశాం
` గజ్వెల్ నియోజకవర్గ నేతలో సీఎం కేసీఆర్ ములాఖత్
హైదరాబాద్(జనంసాక్షి): కరెంట్ కష్టాలే తనను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆనాటి అనుభవాలు,అవమానాలు తెలంగాణ కోసం యుద్దం చేసేలా చేశాయన్నారు. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు, కరెంట్ విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల నాటి ముఖ్యమంత్రులను ప్రశ్నించిన విషయాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణకు పరిశ్రమలు రావొద్దా.. కరెంట్ కష్టాలతో రైతులు ఇబ్బందులు పడాల్నా.. అని నాటి సీఎంలను నిలదీసినట్లు సీఎం గుర్తు చేశారు. నాటి సమైక్య పాలకుల అరాచకాలను భరించలేకనే తెలంగాణ సంక్షేమం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ తెలిపారు. షీమర్ పేట సవిూపంలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజున్న ముఖ్యమంత్రి కేబినెట్ విూటింగ్‌లో ఏం మాట్లాడుతారు అంటే.. ఇక తెలంగాణకు పెట్టబడులు రావు అని అన్నడు. అట్లెట్ల సర్.. నాకర్థం కాదు అని ప్రశ్నించాను.. తల్లే దయ్యం అయినాక పిల్ల ఎట్ల బతుకుతది అని ప్రశ్నించాను. ముఖ్యమంత్రే స్వయానా తెలంగాణకు పెట్టుబడులు రావు అని చెప్పిన తర్వాత.. పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించాను. విూ ఉద్దేశం ఏంది.. రావొద్దు అనా..? బెదిరించుడా? అని అడిగాను. ఇది పొరపాటు.. ఇలా మాట్లాడొద్దని జగడం కూడా పెట్టుకున్నాను. తెలంగాణ అంటే ఒక లెక్క, లక్ష్యం, వాయిస్, నాయకుడు లేని పరిస్థితి అని కేసీఆర్ వివరించారు. నాడు ఎన్నికలు రాగానే.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు టికెట్లు ముందు ఇచ్చేవారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ దగ్గర ఉంటదనే నెపంతో లాస్ట్‌కు ఇచ్చేవారు. ఓ ఎలక్షన్ల మా నాన్న చనిపోతే నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. విూ టికెట్ ్గªనైల్ అయిందంట.. వచ్చి ఫారాలు తీసుకొని వెళ్లమని ఫోన్ కాల్ వచ్చిందని డీఎస్పీ వచ్చి నాకు చెప్పిండు. తెల్లారగానే హైదరాబాద్ వచ్చాను.. నాచారం స్టూడియోలో ఫారాలు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్లాను. అక్కడ అందరు తెలంగాణ వారే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దేవుడి మెట్ల వద్ద బిచ్చగాళ్లు కూర్చున్నట్టు కూర్చున్నరు. చాలా బాధ కలిగింది. ఇది ఏం పద్ధతి అని.. టెంటు వేసి నాలుగు కుర్చీలు వస్తే.. సరిపోయేది కదా అని అనుకున్నాను. సేం బిచ్చగాళ్ల సీనే కనిపిందని కేసీఆర్ తెలిపారు. ఇక మా నాన్న చనిపోవడంతో నన్ను పరామర్శించేందుకు మా ఇంటికి సాయంత్రం 22 మంది ఎమ్మెల్యేలు వచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోదామని చెప్పిన. అప్పుడు వారు ఉన్న ఉద్యోగాలు పోతాయి తప్ప తెలంగాణ రాదు అని నిరాశతో మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే అయి తిరుగుతున్నాను. ప్రతి ఊర్లో కరెంట్ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. ట్రాన్స్‌ఫార్మర్ స్కీం కింద బాయికి మూడు, నాలుగు వేలు జమ చేసి లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి. రైతులకు సంబంధించిన 80 లక్షలు పైరవీకారుల వద్ద ఉన్నట్లు తేలింది. దాంతో అప్పుడున్న విద్యుత్ అధికారిని పిలిచి అడిగాను. కరెంట్ సమస్య పోవాలంటే, పాలసీ నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలో జరగాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు పెంచాలి, తీగలు ఇవ్వాలి, కొత్త సబ్ స్టేషన్లు ఇవ్వాలి. కొంత స్లాబ్‌లు ఇస్తే.. తెలంగాణ రైతాంగం బతుకుతది అని కరెంట్ అధికారి చెప్పారు. దాంతో నేనే 27 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి, ఎన్టీ రామారావు వద్దకు పోయినా. ఆయన విద్యుత్ అధికారులతో మాట్లాడారు. స్తంభాలు పెంచుతాం, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తాం.. కానీ బిల్లులకు స్లాబ్‌లు మాత్రం ఇవ్వను అని విద్యుత్ అధికారి తాతారావు చెప్పారు. ఇక నేను మొండి పట్టు పడితే.. ఇంకో అధికారిని పిలిపించి సీఎం మాట్లాడిరడు.. ఎమ్మెల్యేలు చెప్పిందే కరెక్ట్.. ఒక పరిశ్రమ అక్రమంగా తీసుకునే కరెంట్‌ను అరికట్టి స్లాబ్‌లు ఇవ్వొచ్చని సూచించారు. అలా స్లాబ్‌లు తెచ్చిందే నేనే అని కేసీఆర్ స్పష్టం చేశారు.నాడు కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని కేసీఆర్ తెలిపారు. నేను మంత్రిగా ఉన్న టైంలో సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మాట్లాడుతూ.. విద్యుత్ స్లాబ్‌ను రూ. 85కు పెంచాలని చెప్పిండు. తెలంగాణ రైతులు బతకకుండా వెళ్లిపోవాల్నా.. దేశంలో ఉండకుండా వెళ్లిపోవాల్నా అని అడిగాం. గంటన్నర సేపు కేబినెట్ విూటింగ్‌లో చర్చ జరిగింది. ఒప్పుకోమని కొట్లాడితే.. ఆఖరికి రూ. 35కు తెచ్చిండు. మళ్లా పెంచొద్దని కండీషన్ పెట్టాను. నేను మంత్రిగా ఉన్నాను. ఇక గజ్వేల్‌లో జరిగిన విూటింగ్‌లో చంద్రబాబుతో అదే విషయాన్ని చెప్పించాను. స్లాబ్ రూ. 35 చేసినం.. ఇక పెంచమని చంద్రబాబు మాటిచ్చిండు. కానీ 1999 ఎన్నికలు కాగానే ఎవర్ని మాట్లాడినివ్వకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి, ఏడాదికి 15 శాతం పెరుగుతదని చెప్పాడు. నాకు కోపం వచ్చి బహిరంగ లేఖ రాశాను. చూస్తూ చూస్తూ మా ప్రజలను చంపేస్తుంటే మౌనంగా మాట్లాడకుండా ఉండలేం. విూ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదు అని నమ్మి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పోతాను అని చెప్పాను. వెనక్కి తీసుకోలేదు. రైతులు నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే బషీర్‌బాగ్‌లో పట్టపగలే ఉదయం 11 గంటలకు వారిపై కాల్పులు జరిపి రైతులను బాబు పొట్టనపెట్టుకున్నాడు అని కేసీఆర్ తెలిపారు.తదనంతరం కొందరితో మాట్లాడి ఉద్యమానికి శ్రీకారం చుట్టాను అని కేసీఆర్ తెలిపారు. అనేక అవరోధాలు అధిగమించి, పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. విూ అందరితో మనవి చేసేది ఒక్కటే.. గజ్వేల్ అభివృద్ధి అయింది అంటే అయింత ముఖం కొడుతది.. దిష్టి కొడుతది మనకు. కావాల్సింది చాలా ఉంది.. జరగాల్సి ఇంకా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రిలాక్స్ కావొద్దు. ఇంకేం కావాలో ఆలోచించాలి తప్ప.. అయినదాంతో సంతృప్తి పడొద్దు. సాధించిన దానితో సంతృప్తి పడి సంబురాలు చేసుకోవడం కాదు.. భవిష్యత్‌ను ఇంకా మార్గనిర్దేశనం చేసుకోవాలి. ఇంకేం చేయాలో ఆలోచించాలి. జరిగింది విూ కండ్ల ముందే ఉంది డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.