మళ్లీ కోహ్లీనే నంబర్ వన్
దుబాయ్,అక్టోబర్30(జనంసాక్షి) : భారత క్రికెట్ జట్టు సారథి, పరుగుల మెషిన్ విరాట్ కోహ్లీ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలతో మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మరో పక్క భారత బౌలర్ బుమ్రా కూడా తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు . తాజా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ(889) తన కెరీర్‌లోనే అత్యుత్తమ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక పాయింట్లు సాధించింది కోహ్లీనే కావడం విశేషం. 1998లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ 887 పాయింట్లు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. డివిలియర్స్(872), డేవిడ్ వార్నర్(865) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ(7), ధోనీ (11), శిఖర్ ధావన్(15) టాప్-20లో చోటు దక్కించుకున్నారు. అగ్రస్థానం కోల్పోయిన పది రోజుల్లోనే కోహ్లీ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్(8), భువనేశ్వర్ కుమార్(15) మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా(121) అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్(119) రెండో స్థానంలో నిలిచింది.