మళ్లీ చార్జీల మోత
– పెరగనున్న విద్యుత్, ఆర్టీసీ చార్జిలు
హైదరాబాద్,జూన్ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. దాదాపు రెండేల్ల తరవాత ఈ రంగాల్లో భారం తగ్గించుకునే పనిలో ప్రభుత్వం పడింది. ప్రభుత్వం చేయూతను ఇస్తున్నా మనుగడ కష్టం కావడంతో ఇక చివరిగా ఛార్జీల పెంపుపై దృష్టి పెట్టింది. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో ఛార్జీల పెంపుపై సిఎం కెసిఆర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఇరు సంస్థల అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఛార్జీల పెంపు సామాన్యుడికి భారంగా ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో తెలంగాణ ప్రజలకు త్వరలో చార్జీల మోత మోగనుంది. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడుకు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. దీంతో ఛార్జీల పెంపుపై గురువారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అయితే సూత్రప్రాయంగా ఛార్జీల పెంపునకు అంగీకరించారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోవిూటర్ల లోపు రూపాయి, 30 కిలోవిూటర్లు దాటితే రూ.2 పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూనే.. ఇతర బస్సు సర్వీసుల్లో ఛార్జీల పెంపు 10శాతానికి మించరాదని సీఎం సూచించారు. గృహ అవసరాలకు 100 యూనిట్లలోపు విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని, 100 యూనిట్లు దాటితే స్వల్పంగా పెంచాలని విద్యుత్ అధికారులకు కేసీఆర్ సూచించారు. పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7శాతం లోపే పెంపు ఉండాలన్నారు. సింగరేణి బలోపేతానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఆర్టీసీ, విద్యుత్ శాఖ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. సంస్థల ఆదాయ, వ్యయాలు, నష్టాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలకు కాపాడటానికి కృషి చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కునారిల్లిపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలవల్ల విద్యుత్, ఆర్టీసీ సంస్థలు కోలుకున్నాయి. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కడానికి ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్‌ను మెరుగుపర్చేందుకు ఖర్చుకు వెనకాడకుండా అదనపు సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల నిర్మాణం చేపట్టినం. దీని కోసం తెలంగాణలో రెండు డిస్కంలు, ట్రాన్స్‌కో కలిసి రూ.2,144 కోట్ల అప్పులు చేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. కోతలు లేకపోవడం వల్ల ఉత్పత్తికి మించిన విద్యుత్ అవసరమవుతోంది. గత ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తి కాలేదు. స్వల్పకాలిక పవర్ పర్చేస్ అగ్రిమెంట్లతో విద్యుత్ కొనాల్సి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్థలు రూ.2700కోట్లు ఖర్చు చేశాయి. ఉద్యోగుల వేతనాలు పెంచడంతో అదనపు భారం విద్యుత్ సంస్థలపై పడింది. రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ కోసం రూ.2400 కోట్లు ఖర్చు చేసి సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టినం. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై పలు ప్రతిపాదనలు సీఎంకు అధికారులు వివరించారు. సామాన్యులు, గృహ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఛార్జీలు పెంచాలని సంస్థలకు సీఎం సూచించారు. 100 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే వారికి ఛార్జీలు పెంచొద్దని తెలిపారు. 100 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకుంటే స్వల్పంగా పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 86 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో 60 లక్షల కనెక్షన్లు 100 యూనిట్ల లోపు వాడుకుంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది వినియోగదారులకు అదనపు భారం పడదని సీఎం అధికారులకు వివరించారు. పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్ 10శాతం పెంచడం ఆమోదయోగ్యమేనని యజమానులు తెలిపారు. పరిశ్రమలకు పదిశాతం కాకుండా ఏడుశాతంలోపే పెంపుదల ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సవిూక్షలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.