మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం

 

హ్యాయ్‌లాండ్‌ ఆస్తులతో పేచీ

కేసులు తెగక బాధితుల్లో ఆందోళన

విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్‌లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్‌ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బేరసారాలు జరిపారు. ప్రభుత్వాధినేతకు, అధికార పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడనే గుర్తింపు కలిగిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా అగ్రిగోల్డ్‌ ఆస్తులు, కేసుల వ్యవహారాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఒకదశలో హాయ్‌ల్యాండ్‌తోపాటు విజయవాడలోని అగ్రిగోల్డ్‌ ప్రధాన కార్యాలయ భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కీసరలోని పొలాలను తమకు కట్టబెడితే కేసుల నుంచి బయటపడేస్తామనే ప్రతిపాదనను అధికార పార్టీ పెద్దల తరఫున ఆ అధికారి తెచ్చారు. చివరకు అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి బిడ్డర్లు రాకుండా అధికార పక్షం అడ్డుకున్నట్టు విమర్శలు వచ్చాయి. బిడ్‌లు వేసేందుకు వచ్చిన ఔత్సాహికులను కొందరు అధికార పక్షం నేతలు భయపెట్టి వెనక్కి పంపినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్తులను దక్కించుకునేందుకు ఇతరులు బిడ్లు వేయకుండా తమ మనుషులనే రంగంలోకి దించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే లక్షలాది

మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్‌ వేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్‌ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు. అగ్రిగోల్డ్‌ మోసంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన పరిధిలోని సీఐడీకి ఈ కేసును హడావుడిగా అప్పగించి చేతులు దులుపుకుంది. హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తాజాగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ తమదేనని ఇన్నాళ్లూ చెప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వంలోని బడాబాబుల హస్తం ఉందని బాధితులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్‌ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని ఆర్కా లీజర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అల్లూరు వెంకటేశ్వరరావు హైకోర్టుకు చెప్పడాన్ని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం తప్పుపడుతోంది. హాయ్‌ల్యాండ్‌పై తొలుత దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ కన్నేసింది. బేరం కుదరకపోవడంతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి సవిూపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే దాదాపు 86 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్‌ విస్తరించింది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్‌, 18 ఎకరాల్లో కల్యాణ మండపం, క్లబ్‌హౌస్‌, వాహనాల పార్కింగ్‌, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే దాదాపు 10 ఎకరాల్లో గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. గుర్గావ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అగ్రిగోల్డ్‌ యాజమాన్యం అంగీకరించ లేదు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ముఖ్యనేతకు భాగస్వామిగా ఉన్న అధికార పార్టీ ఎంపీ కూడా హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సెల్‌ గ్రూప్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. విజయవాడ ఏలూరు రోడ్డులో అగ్రిగోల్డ్‌కు చెందిన మిల్క్‌ భవన్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌ తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. మొత్తంగా ఇప్పుడు వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో అంతా ఏంజరుగుతోందో అన్న అనుమానాలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నాలుగన్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, ఏజెంట్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.