మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా
– కాంగోలో 17మంది మృతి
కిన్‌షాసా, మే9(జనం సాక్షి) : అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ బయటపడింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఎబోలా వల్లే మరణాలు సంభవించాయని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంచేశారు. తమ దేశంలో మరోసారి ఎబోలా వైరస్ వ్యాపించిందని, దీంతో దేశంలో అంతర్గత ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించామని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సుశిక్షితులైన సిబ్బంది రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. బికోరో పట్టణం సవిూపంలోని గ్రామంలో దాదాపు 21 మంది కొద్ది రోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వారిలో 17 మంది చనిపోయారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ బయటపడడం ఇది తొమ్మిదోసారి. దాదాపు ఏడాది క్రితమే ఎబోలా కారణంగా కాంగోలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. గునియా, సియర్రా, లియోన్, లైబీరియా సహా పలు దేశాల్లో కలిపి 11,300
మంది చనిపోయారు. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకడంతో చికిత్స పొందారు.