మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయండి

5

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):

మహబూబ్‌నగర్‌  ప్రాజెక్టులను త్వరితగతిన జిల్లాకు సాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్కిల్‌ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాలమూరు ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష జరిపారు. సత్వరం ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి పరిహారం చెల్లించి ముందుకు సాగాలన్నారు. భూనిర్వాసితుల కోసం ఇప్పటికే కలెక్టర్‌ వద్ద 300 కోట్లు ఉన్నాయని, మార్కెట్‌  రేటుకే భూసేకరణ జరపాలన్నారు. ఇక  మహబూబ్‌నగర్‌ కేంద్రంగా పనిచేసే ఈ సర్కిల్‌లో ఇంజనీర్లతో పాటు 212 మంది సిబ్బంది ఉంటారు. జూన్‌ 11వ తేదీన ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో శంకుస్థాపన చేశారు. దానికి 35 వేల 200 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా హైదరాబాద్‌కు మంచినీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు. దీనికి 90 టిఎంసిల నీటిని వాడుకుంటారు.  పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సిఎం వేగం పెంచి నీరందించాలని  నిర్ణయించుకున్నారు.  శ్రీశైలం జలశయానికి వరద నీరు వచ్చి పడుతున్నప్పుడు ప్రతి రోజూ ఈ ప్రాజెక్టు ద్వారా1.5 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తారు. ఎవరు అడ్డువచ్చినా  ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమని తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా చెబుతోంది. ఆంధప్రదేశ్‌ టిడిపి ప్రభుత్వ అభ్యంతరాలను నిరసిస్తూ జులై 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌ను కూడా నిర్వహించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి లేదని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే, ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దీన్ని తలపెట్టారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో తమకు వచ్చే వాటాను ఎక్కడైనా వాడుకునే హక్కు తమకు ఉందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టిఎంసిల నీటిని వాడుకోకుండా ఎవరూ ఆపలేరని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.