మహాకూటమిలోనే ఉంటాం
– సీట్ల కేటాయింపుపై ఇంకా క్లారిటీ రాలేదు
– మాపై అధికార పార్టీ గోబెల్స్ ప్రచారంచేస్తుంది
– రేపు సాయంత్రం మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ
– విలేకరుల సమావేశంలో టీజేసీ అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్29(జనంసాక్షి) : తెలంగాణలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి పార్టీ మహాకూటమితో విభేదిస్తోందని.. బీజేపీతో పొత్తుకు సై అంటుందన్న వార్తలు అవాస్తవమని టీజేసీ కన్వీనర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. బీజేపీతో తెలంగాణపై మా అభిప్రాయ పంచుకున్నామని, అసేంబ్లీ రద్దుకు ముందే ఈ విషయాలు మాట్లాడామని, ఆ తర్వాత సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్ష ముసాయిదా తయారుచేశామని, అమలుతీరుపై చర్చిస్తామని తెలిపారు. రెండురోజుల్లో ఎజెండా తయారు చేస్తామని, ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభకు అజిత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఎల్లుండి కరీంనగర్ లో ఉద్యమ ఆకాంక్ష సాధన ధూంధాం నిర్వహిస్తామని, 3వ తేదీ నుంచి మెదక్ నుండి వరంగల్ కు పోరుయాత్ర వారంరోజుల పాటు నిర్వహిస్తామన్నారు. 10న వరంగల్ లో పోరుసభ నిర్వహించనున్నట్టు కోదండరాం తెలిపారు. ఇక మహాకూటమి పొత్తుల పక్రియ కొనసాగుతోందని, మొదటి దశలో మేనిఫెస్టోపైనే చర్చ సాగిందని, రెండవ దశలోనే సీట్లపై చర్చలు జరుగుతాయన్నారు. మరోకూటమిపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు అపోహలు సృష్టించడం వెనక ముఖ్యమంత్రి కార్యాలయం ఉందన్న అనుమానం మాకు కలుగుతోందని కోదండరాం ఆరోపించారు. మాపై అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.